తెలంగాణలో పరిమిత స్థాయిలోనే నేరాల సంఖ్య : డీజీపీ అంజనీ కుమార్

తెలంగాణలో పరిమిత స్థాయిలోనే నేరాల సంఖ్య : డీజీపీ అంజనీ కుమార్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేరాల నమోదు పరిమిత స్థాయిలోనే ఉన్నాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నేరాలు, ఫంక్షనల్ వర్టికల్స్ పై పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో డీజీపీ అంజనీ కుమార్ శనివారం (జులై 22న) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐడీ అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్, అడిషనల్ డీజీ పర్సనల్ సౌమ్య మిశ్రా, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, ఐజీ షానవాజ్ ఖాసీం పాల్గొన్నారు. 

రాష్ట్రంలో నేరాల సంఖ్య తక్కువ స్థాయిలోనే ఉందని, నేరాల దర్యాప్తు పూర్తై.. శిక్ష పడ్డ కేసులలో మంచి పురోగతి ఉందని తెలిపారు డీజీపీ అంజనీ కుమార్. గతేడాది 55మందికి యావజ్జీవ శిక్ష పడగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 88 మందికి శిక్ష పడిందని... ఇది తెలంగాణ పోలీసుల వృత్తి ప్రామాణికతకు ఉదాహరణ నిలిచిందని తెలిపారు. తమ తమ ప్రాంతాల్లో జరిగే నేరాలపై శాస్త్రీయపరమైన సమీక్ష జరపాలని, ఆయా నేరాలు ఏందుకు జరుగుతున్నాయో..? వాటి  మూలాలు తెలుసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు డీజీపీ సూచించారు. చైన్ స్నాచింగ్ లాంటి నేరాలపట్ల కఠినంగా ఉండాలని స్పష్టం చేశారు.

నేర పరిశోధన, దర్యాప్తులో ఇన్వెస్టిగేషన్ అధికారులకు తగు సలహాలు, సాంకేతిక సహకారం అందించేందుకు డీజీపీ కార్యాలయంలో 'ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ సపోర్ట్ సెంటర్' ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, ఈ సేవలను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని డీజీపీ సూచించారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీసుశాఖ పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందేలా ముందుకు సాగాలన్నారు. పెరిగిపోతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి.. వాటి నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీలేకుండా పని చేయాలని చెప్పారు. 

దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా నేర పరిశోధనలో ఫోరెన్సిక్ సైన్స్ ను ఉపయోగించడంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు అడిషనల్ డీజీ షికా గోయల్ తెలిపారు. జులై 1 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న ‘‘ఆపరేషన్ ముస్కాన్’’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 1710 మంది చిన్నారులను గుర్తించామని, 317 మందిపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ అమలుపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని మహేష్ భగవత్ చెప్పారు.