- ఓఆర్ఆర్ ప్రమాదంపై సమీక్ష
- ఔటర్‌పై ప్రమాదాల నివారణకు కొత్త వ్యూహాలు అవలంబించాలని సూచన
- ట్రాఫిక్ మేనేజ్ మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో
- ఏర్పాటు చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యలపై గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపాలన్నారు. వాహనదారులకు, సామాన్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. శుక్రవారం ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి.. ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ చందనా దీప్తి, ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే సహా ట్రాఫిక్ అధికారులతో డీజీపీ శనివారం సమీక్ష నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న డ్రంకన్ డ్రైవ్, హైస్పీడ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ సహా హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి రూల్స్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం వ్యవహరించాలన్నారు. ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాల నివారణకు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలన్నారు. వాహనాల వేగాన్ని కచ్చితంగా నియంత్రించడంతో పాటు, భద్రతా ప్రమాణాల అమలులో రాజీపడకూడదని సూచించారు.
రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ‘ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో’ ను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అవలంబించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ పరిధిలోని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్లు, డీసీపీలతో ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితులపై సమీక్షలు జరుపాలని సూచించారు.
