- కోర్టు కేసులు, న్యాయ ప్రక్రియలపై మరింత దృష్టి పెట్టాలి: డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, వెలుగు: మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను పోలీసింగ్‌లో వినియోగించాలని పోలీస్ అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మన పోలీసింగ్ దేశంలోనే ముందంజలో ఉండాలంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్‌ఎస్), ఇంట్రా ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్)లను నిరంతరం అప్‌డేట్ చేస్తూ సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఆరు నెలల నేరాల సమీక్షలో భాగంగా శనివారం రెండో రోజు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం నిర్వహించారు. యువ ఐపీఎస్‌లతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందికి పలు కీలక అంశాలపై మాట్లాడారు. న్యాయపరమైన అంశాలపై నిరంతర శిక్షణతో పాటు కోర్టు కేసుల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కేసు దర్యాప్తు, కోర్టు విధానాలు, న్యాయపరమైన అంశాలపై పోలీసులకు నిరంతరం శిక్షణ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో నేర నియంత్రణకు వివిధ ప్రమాణాల అమలులో ప్రతిభ కనబరిచిన పోలీసు విభాగాలను అభినందించారు.
