డ్రగ్స్ కట్టడికి యువత ముందుకు రావాలి : డీజీపీ జితేందర్‌‌‌‌

డ్రగ్స్ కట్టడికి యువత ముందుకు రావాలి : డీజీపీ జితేందర్‌‌‌‌
  • మత్త పదార్థాలపై అవగాహన కల్పించాలి
  • ఈనెల 26న అంతర్జాతీయ డ్రగ్స్  డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు

హైదరాబాద్‌‌, వెలుగు: డ్రగ్స్‌‌  కట్టడికి యువత ముందుకు రావాలని డీజీపీ జితేందర్‌‌  పిలుపునిచ్చారు. దాని వల్ల కలిగే చెడు ప్రభావాలపై ప్రతిఒక్కరు కనీసం పది మందికి అవగాహన కలిగించాలని, వారు మరో పది మందికి చెప్పేవిధంగా ప్రోత్సహించాలని సూచించారు. యువత భవితకు డ్రగ్స్  మహమ్మారి పెను ముప్పుగా మారిందని, దీనికి దూరంగా ఉండేలా పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డీజీపీ పేర్కొన్నారు. ఈనెల 26న అంతర్జాతీయ డ్రగ్స్ డేను పురస్కరించుకుని టీజీ యాంటీ నార్కోటిక్స్‌‌  బ్యూరో పలు ప్రభుత్వ విభాగాలతో కలిసి శనివారం యాంటీ -డ్రగ్స్  అవగాహన వారోత్సవాలు ప్రారంభించింది. 

బంజారా హిల్స్‌‌లోని కమాండ్‌‌  అండ్‌‌  కంట్రోల్‌‌  సెంటర్‌‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీజీపీ జితేందర్‌‌  ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్‌‌ కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా టీజీఏఎన్‌‌బీతోపాటు మిషన్‌‌  పరివర్తన్‌‌, ఇన్ స్టిట్యూట్‌‌  ఆఫ్‌‌  మెంటల్‌‌  హెల్త్‌‌, ఆశా ఆసుపత్రి, టీజీ సీఎస్‌‌బీ, మహిళా భద్రత విభాగం, టాస్క్‌‌, సిటీ సెక్యురిటీ కౌన్సిల్‌‌, సిటీ సెక్యూరిటీ వింగ్‌‌  తరఫున ఏర్పాటు చేసిన స్టాళ్లను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.

 యాంటీ డ్రగ్స్  సోల్జర్స్‌‌గా పనిచేస్తామని ఈ సందర్భంగా స్టూడెంట్లు ప్రతిజ్ఞ చేశారు. మొత్తం 15 పాఠశాలలకు చెందిన  రెండువేల మంది విద్యార్థులు స్టాల్స్‌‌ ను సందర్శించారని టీజీఏఎన్‌‌బీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీ ఏఎన్‌‌బీ డైరెక్టర్‌‌ సందీప్‌‌  శాండిల్య, టీజీ సీఎస్‌‌బీ డైరెక్టర్‌‌ శిఖా గోయల్‌‌, హైదరాబాద్‌‌  కలెక్టర్‌‌  హరిచందన దాసరి, హైదరాబాద్‌‌  కమిషనరేట్‌‌  శాంతిభద్రతల అడిషనల్‌‌  సీపీ విక్రమ్  సింగ్‌‌ మాన్‌‌, టీజీఐసీసీసీ డైరెక్టర్‌‌ వీబీ కమలాసన్‌‌ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.