
- అన్ని జిల్లాల ఏఎస్పీలకు డీజీపీ జితేందర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: అందాల పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని జిల్లాల అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఏఎస్పీ)లను డీజీపీ జితేందర్ ఆదేశించారు. జిల్లాల్లోని టూరిస్టు ప్రాంతాలు, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పర్యటించే ప్రాంతాల్లో నిఘా కొనసాగించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో అసిస్టెంట్ ఎస్పీలుగా పనిచేస్తున్న యువ ఐపీఎస్‌లతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
డీజీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, సత్యనారయణతో కలిసి గైడ్చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఏఎస్పీలను వారి పరిధిలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నేరాల సమాచారం, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ప్రజలతో మెరుగైన సంబంధాలు కొనసాగించాలని సూచించారు.
రానున్న రోజుల్లో ప్రతినెలా ఏఎస్పీలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సమావేశానికి వివిధ జిల్లాలకు చెందిన అసిస్టెంట్ ఎస్పీలు బి చైతన్య, ఆర్ రాహుల్ రెడ్డి, రిత్విక్ సాయి, సాయికిరణ్ సహా పలువురు యువ ఐపీఎస్‌లు హాజరయ్యారు