కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న డీజీపీ, సీపీ

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న డీజీపీ, సీపీ

కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా ఫ్రంట్ వారియర్ గా ఉన్న పోలీసులకు ఇవాళ (శనివారం) కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది.  ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి..తిలక్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నానని…ఎలాంటి అపోహలకు గురి కాకుండా అందరూ ముందుకు వచ్చి కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనాను కట్టడి చేయడంలో ఎంతో కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.పోలీస్ శాఖ లో మొత్తం 60 వేల మంది ఉన్నారన్న డీజీపీ మహేందర్ రెడ్డి… అందరూ ముందుకు వచ్చి వాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు.

మల్కాజిగిరి ప్రైమరీ సెంటర్‌లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్. మల్కాజిగిరి ప్రైమరీ సెంటర్‌లో మొదటిగా తానే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెప్పారు. ఎలాంటి ఇబ్బంది లేదని… వైద్య సిబ్బంది అరగంట విశ్రాంతి తీసుకోమన్నారని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహ వద్దని చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సీపీ పిలుపునిచ్చారు. 15 కేంద్రాల్లో రోజుకు 100 మంది సిబ్బంది వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. నాలుగు రోజుల్లో వ్యాక్సన్ పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు. కచ్చితంగా పోలీసులు వ్యాక్సిన్ తీసుకోవడంలో ముందుంటారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు.