త్వరలో హోంగార్డు నియామకాలు..కారుణ్య నియామకాల అంశం పరిశీలిస్తున్నం: డీజీపీ శివధర్ రెడ్డి

త్వరలో హోంగార్డు నియామకాలు..కారుణ్య నియామకాల అంశం పరిశీలిస్తున్నం: డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హోంగార్డుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, కొత్తగా హోంగార్డుల నియామకాలు చేపడతామని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. కారుణ్య నియామకాలతో సహా మిగిలిన కీలక అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, హోంగార్డులు త్వరలోనే శుభవార్త వింటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్, లక్డీకపూల్‌‌లోని డీజీపీ కార్యాలయంలో శనివారం హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 

అనంతరం హోంగార్డులు ఏర్పాటు చేసిన సమావేశానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 30 ఏండ్లుగా  సేవలందిస్తున్న సీనియర్ హోంగార్డులు, మహిళా హోంగార్డులతో కలిసి కేక్ కట్ చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోంగార్డులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..“ పోలీసు శాఖకు వెన్నెముకలా పనిచేస్తూ, ఎక్కువ ప్రతిఫలం ఆశించకుండా సేవలందిస్తున్న హోంగార్డులను అభినందిస్తున్నాను. 

నేను ఉద్యోగంలో చేరిన సమయంతో పోల్చితే ఇప్పుడు వారి పరిస్థితి గణనీయంగా మెరుగైంది. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డులకు ఎచ్‌‌డీఎఫ్‌‌సీ, యాక్సిస్ బ్యాంకులు ఇప్పటికే ఎక్స్‌‌గ్రేషియా అందిస్తున్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కోసం బ్యాంకు అధికారులతో ఇప్పటికే చర్చించాను ” అని తెలిపారు. 

 హోంగార్డ్స్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. హోంగార్డులకు సంబంధించి పరిశీలనలో ఉన్న అంశాలపై అధికారులతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. కార్యక్రమంలో శాంతి భద్రతల అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, సీఐడీ అడిషనల్ డీజీపీ చారుసిన్హా, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.