- రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య లేదు: డీజీపీ శివధర్ రెడ్డి
- నేరాల నియంత్రణకు టెక్నాలజీ వాడుతున్నట్టు వెల్లడి
- మేడిపల్లిలో సిటీ ట్రైనింగ్ సెంటర్‌కు శంకుస్థాపన
దిల్ సుఖ్ నగర్/మేడిపల్లి, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్, భరోసా సెంటర్ (ఉమెన్ సేఫ్టీ వింగ్)ను సీపీ సుధీర్ బాబుతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో రూ.ఐదు కోట్లతో నిర్మించనున్న సిటీ ట్రైనింగ్ సెంటర్ (సీటీసీ)కు కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలేదని, నేరాల నియంత్రణకు టెక్నాలజీ వాడుతున్నామని చెప్పారు.
మహిళల భద్రత, పిల్లల రక్షణ, గృహ హింస వంటి అంశాల్లో తక్షణ స్పందన, సహాయం అందించడం భరోసా సెంటర్ ప్రధాన లక్ష్యమన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించడం, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం చేయడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల కెమెరాలు కమాండ్ సెంటర్‌తో అనుసంధానమవుతున్నాయన్నారు. మహిళలు, బాలికల భద్రత కోసం ప్రత్యేక మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీ సామాజిక సమస్యలు
సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీ సామాజిక సమస్యలుగా రూపాంతరం చెందుతున్నాయని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాలను నివారించడం, బాధితుల సొమ్ము రికవరీలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు కూడా కొత్త రూపాలు సంతరించుకుంటున్నాయని, వాటిని సమర్థంగా ఎదుర్కొవాలంటే ప్రతి పోలీస్ అధికారికి సాంకేతిక నైపుణ్యం అవసరమని అన్నారు.
ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న సీటీపీ పోలీసులకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ఈ తరహా సీటీసీలను రాష్ట్రంలోని అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషారాణి , టీజీపీఐసీఎస్ ఎండీ ఎం.రమేశ్, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, అదనపు డీసీపీ, ఉమెన్ సేఫ్టీవింగ్ ఎస్పీ షైక్ సలీమా, ఏసీపీ పి.వెంకటేశ్వర్లు, ఇన్స్ స్పెక్టర్లు ఎం.ముని, జి.అంజయ్య, సైదిరెడ్డి, సైదులు పాల్గొన్నారు.
