
హైదరాబాద్, వెలుగు: ప్రజలందరూ వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కోరారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్, మాస్క్ మాత్రమే ప్రస్తుతం ఉన్న ఆయుధాలని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇండియాలో ప్రస్తుతానికి రికార్డు కాలేదని తెలిపారు. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో కరోనా కంట్రోల్‌లో ఉందని, రోజుకు 150 కేసులు మాత్రమే నమోదవుతున్నాయని తెలిపారు. కొత్త వేరియంట్ రాష్ట్రంలోకి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లకు ఎయిర్‌పోర్టులోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయిస్తున్నామన్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తామన్నారు. ఒమిక్రాన్ కేసులు నమోదైన 12 దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లు పాజిటివ్ వచ్చినా, నెగెటివ్ వచ్చినా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని డీహెచ్ స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరం అనేదానిపై పరిశోధనలు జరుగుతున్నాయని, ప్రజలందరూ అలర్ట్‌గా ఉండాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి సూచించారు.