- వరల్డ్ రికార్డుతో గోల్డ్ నెగ్గిన షూటర్
తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ టోక్యో డెఫ్‌లింపిక్స్‌లో వరల్డ్ రికార్డు బ్రేక్ చేస్తూ దేశానికి తొలి స్వర్ణం అందించాడు. ఆదివారం జరిగిన మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ధనుష్ బంగారు పతకం సొంతం చేసుకోగా.. ఇండియాకే చెందిన మహ్మద్ ముర్తజా సిల్వర్ మెడల్‌తో మెరిశాడు.
న్యూఢిల్లీ: తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ విశ్వవేదికపై అదరగొట్టాడు. టోక్యో డెఫ్‌లింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్) లో వరల్డ్ రికార్డు బ్రేక్ చేస్తూ దేశానికి తొలి స్వర్ణం అందించాడు. ఆదివారం జరిగిన మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో 23 ఏండ్ల ధనుష్ బంగారు పతకం సొంతం చేసుకోగా.. ఇండియాకే చెందిన మహ్మద్ ముర్తజా సిల్వర్ మెడల్‌తో మెరిశాడు. గత డెఫ్‌లింపిక్స్‌లో రెండు గోల్డ్ మెడల్స్‌తో ఔరా అనిపించిన హైదరాబాదీ శ్రీకాంత్ ఈసారి కూడా తన మార్కు చూపెట్టాడు. ఫైనల్లో 252.2 స్కోరుతో వరల్డ్ రికార్డు (డెఫ్ కేటగిరీ) బ్రేక్ చేసి పోడియంపై త్రివర్ణాన్ని రెపరెపలాడించాడు.
ముర్తజా 250.1 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం అందుకోగా.. సౌత్ కొరియా షూటర్ బయెక్ సెయుంఘాక్ 223.6 స్కోరుతో కాంస్యం గెలిచాడు. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో శ్రీకాంత్ 630.6 స్కోరుతో డెఫ్ ఒలింపిక్ రికార్డు కూడా బ్రేక్ చేస్తూ అగ్రస్థానంతో ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యాడు. మూర్తజా (626.3) రెండో ప్లేస్‌లో నిలిచాడు. 2021లో బ్రెజిల్‌లో జరిగిన గత ఎడిషన్‌లో 10 మీటర్ల వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో రెండు స్వర్ణాలు గెలుచుకున్న ధనుష్ ఇప్పుడు రెండు రికార్డులు బ్రేక్ చేస్తూ (డెఫ్‌లింపిక్స్, వరల్డ్) తన కెరీర్‌లో మూడో డెఫ్‌లింపిక్స్ స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు. పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న ధనుష్ సోమవారం మహిత్ సంధుతో కలిసి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పోటీపడనున్నాడు.
మహిత్‌కు రజతం, కోమల్‌కు కాంస్యం
విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలోనూ ఇండియా షూటర్లు సత్తా చాటారు. మహిత్ సంధు 250.5 పాయింట్లతో రజతం గెలుచుకోగా, కోమల్ వాఘ్‌మారే 228.3 పాయింట్లతో కాంస్య దక్కించుకుంది. ఉక్రెయిన్ షూటర్ లిడ్కోవా వైలెటా (252.4) వరల్డ్ రికార్డు స్కోరుతో స్వర్ణం గెలుచుకుంది. మొత్తంగా పోటీల తొలి రోజే ఇండియా గోల్డ్ సహా నాలుగు మెడల్స్ ఖాతాలో వేసుకుంది.
ధనుష్‌కు రూ. 1.2 కోట్ల ప్రోత్సాహకం: మంత్రి శ్రీహరి
ప్రతిష్టాత్మక డెఫ్‌లింపిక్స్‌లో గోల్డ్ నెగ్గిన ధనుష్ శ్రీకాంత్ కు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందలు తెలిపారు. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం అతనికి కోటి 20 లక్షలు రూపాయల ప్రోత్సాహకం ఇస్తున్నామని ప్రకటించారు.
