ధరణిపై వాట్సాప్​లో ఫిర్యాదులు చేసినా మళ్లా మీ సేవకే

ధరణిపై వాట్సాప్​లో ఫిర్యాదులు చేసినా మళ్లా మీ సేవకే
  • ధరణి ఫిర్యాదులపై చేతులెత్తేసిన గ్రీవెన్స్ రెస్పాన్స్ టీమ్
  • వాట్సాప్, మెయిల్ ద్వారా వచ్చిన వినతులపై స్పందిస్తలె
  • ‘మీ సేవ’లో అప్లై చేసుకోండని సీసీఎల్ఏ నుంచి మెసేజ్​లు
  • ధరణిలో ఆప్షన్​ లేకనే వాట్సాప్ చేశామంటున్న బాధితులు
  • 10 రోజుల్లో సమస్య మళ్లీ మొదటికి..

హైదరాబాద్, వెలుగు: ధరణి ఫిర్యాదుల స్వీకరణపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రెండు రోజులుగా బాధితులు తమ భూసమస్యలపై వాట్సాప్ మెస్సేజ్, ఈ మెయిల్ చేస్తున్నా.. గ్రీవెన్స్ రెస్పాన్స్ సిస్టమ్ టీమ్ స్పందించడం లేదు. వాట్సాప్, ఈ– మెయిల్ ద్వారా తమ సమస్యను పంపిన బాధితులకు ‘దగ్గర్లోని మీ సేవ కేంద్రానికి వెళ్లి ధరణి పోర్టల్ లోని గ్రీవెన్స్ రిలేటెడ్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్ ద్వారా అప్లై చేసుకోండి’ అంటూ సీసీఎల్ఏ నుంచి మెస్సేజ్ లు వస్తున్నాయి. దీంతో గత వారం రోజుల్లో వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా పంపిన సుమారు 23 వేల ఫిర్యాదులు, వినతుల పరిస్థితి ఏంటన్న గందరగోళం ఏర్పడింది. ధరణిలో తమ సమస్యకు సంబంధించిన ఆప్షన్ లేకనే వాట్సాప్, ఈ మెయిల్ కు వినతులు సమర్పించామని, మళ్లీ మీ సేవ లో ఎలా అప్లై చేసుకోవాలని బాధితులు వాపోతున్నారు.

దారుల్లేని ధరణి
ధరణి పోర్టల్‌‌లో కొన్ని రకాల సమస్యలకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశముంది. రైతులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలపై అప్లై చేసుకునేందుకు మాడ్యుల్స్ లేవు. అప్లికేషన్ ఫర్ పట్టాదారు పాస్ బుక్ (కోర్టు కేసు), ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టు నుంచి తొలగించడం, భూసేకరణకు సంబంధించిన వినతులు, మిస్సింగ్ సర్వే నంబర్లు, భూమి యజమాని పేరు, తండ్రి/భర్త పేరు, ఆధార్, కులం, జెండర్ వివరాల్లో తప్పులు, ఫొటో మిస్ మ్యాచ్, డిజిటల్ సైన్ కాకపోవడం లాంటి సమస్యలపై మాత్రమే ధరణి పోర్టల్ ద్వారా అప్లై చేసుకునేందుకు సర్కార్ వీలు కల్పించింది.  కానీ పార్ట్ బీ భూముల విషయంలో ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో అధికారులు కూడా వీటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల ఎకరాల పట్టా భూములను పార్ట్ బీలో చేర్చారు. వీటికి పాస్ బుక్స్ జారీ కాలేదు. బాధితులు ఇప్పటికీ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ధరణిలోనూ ఈ వివాదాలపై దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేదు. పోర్టల్‌‌లో చాలా సర్వే నంబర్లు మిస్ అయ్యాయి. సర్వే నంబర్, భూమి వివరాలు కనిపించకుంటే పాస్‌‌బుక్స్ కోసం అప్లై చేసుకునే అవకాశం లేదు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్​అకౌంట్​కు భూసమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. దీంతో ఈ నెల 5న ప్రభుత్వం ధరణి గ్రీవెన్స్ రెస్పాన్స్ సిస్టమ్ టీమ్‌‌ను ఏర్పాటు చేసింది. వాట్సప్ నంబర్ (9133089444), మెయిల్ (ascmro@telangana.gov.in) ద్వారా ఫిర్యాదులు స్వీకరించింది. కానీ 10 రోజులు గడవకముందే ఇవి పని చేయడం మానేశాయి. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.