ఆయన చెంచాగాళ్ల కోసమే ధరణి పోర్టల్ తీసుకొచ్చారు

ఆయన చెంచాగాళ్ల కోసమే ధరణి పోర్టల్ తీసుకొచ్చారు

కామారెడ్డి, వెలుగు: సీఎం కేసీఆర్ కుటుంబం, ఆయన చెంచాగాళ్ల కోసమే ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ధరణి ద్వారా హైదరాబాద్ చుట్టూ ఉన్న కోట్లాది రూపాయల విలువైన భూములను కాజేస్తున్నారని ఆరోపించారు. భూప్రక్షాళన పేరుతో దేవాలయ, వక్ఫ్ తదితర భూముల వివరాలు తెలుసుకొని వాటిని ఆక్రమించుకుంటున్నారని అన్నారు. ధరణి సమస్యలు, కామారెడ్డిలో అక్రమ భూదందాపై కలెక్టర్ ​స్పందించాలని డిమాండ్​చేస్తూ మూడ్రోజులుగా బీజేపీ నేత కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈటల గురువారం కామారెడ్డికి వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు. ధరణి సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో రాష్ర్ట స్థాయిలో పోరాటం చేద్దామని, దీక్ష విరమించాలని కోరారు. వెంకటరమణ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకుముందు మీడియాతో, పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈటల మాట్లాడారు. 

ధరణిలో 24 లక్షల అప్లికేషన్లు పెండింగ్.. 

భూ సమస్యల పరిష్కారానికి ధరణి సర్వరోగ నివారిణి అని చెప్పిన కేసీఆర్.. రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఈటల మండిపడ్డారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నోళ్లు, సెటిల్ మెంట్ చేసుకున్నోళ్ల భూములను మాత్రమే ప్రొహిబిటెడ్ లిస్టు నుంచి తొలగిస్తున్నారని చెప్పారు. పేద, మధ్య తరగతి రైతుల సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని ఫైర్ అయ్యారు. ధరణిలో 24 లక్షల అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న బడుగు బలహీన వర్గాల భూములను లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ల్యాండ్​పూలింగ్ పేరుతో 5,6‌‌‌‌00 ఎకరాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ఆ భూములను తన రియల్​ఎస్టేట్ బినామీలకు కట్టబెట్టాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు.