ఊర్ల వరకే ధరణి ..పట్నాలకు ఇంకో పోర్టల్

ఊర్ల వరకే ధరణి ..పట్నాలకు ఇంకో పోర్టల్
  • పంచాయతీ, మున్సిపల్‌ మధ్య రెస్పాన్సిబులిటీ ప్రాబ్లం
  •  అందుకోసమే మరో వెబ్‌సైట్‌ యోచన

హైదరాబాద్, వెలుగుసర్కార్‌ త్వరలో స్టార్ట్‌ చేయనున్న ధరణి పోర్టల్ భూముల వ్యవహారాలకు సంబంధించి ఆల్‌ ఇన్‌ వన్‌ కాదు. గ్రామీణ ప్రాంతంలోని అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ఆస్తుల వివరాలు మాత్రమే అందులో ఉంటాయి. మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని ఆస్తుల వివరాల కోసం ఇంకో వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయాలని సర్కార్‌ భావిస్తోంది. రెండు శాఖల పరిధిలోని ఆస్తులను ఒకే పోర్టల్ పరిధిలోకి చేర్చితే టెక్నికల్‌ ఇష్యూస్‌ తలెత్తుతాయనే కారణంతో విడివిడిగా పోర్టల్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం పొందిన వెంటనే ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందు కోసం సీఎం కేసీఆర్ పలుసార్లు రివ్యూలు చేశారు. ధరణి అందుబాటులోకి వచ్చేలోపు గ్రామాలు, పట్నాలు, సిటీల్లోని అన్ని రకాల ఆస్తుల వివరాలు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.

రెస్పాన్సిబులిటీ కోసమే ఇంకోటి

ధరణి పోర్టల్‌లో పంచాయతీ, మున్సిపల్ పరిధిలోని ఆస్తుల వివరాలు ఏ శాఖ పరిధిలోకి వస్తుందనే క్లారిటీ లేదు. అందులో తప్పులు జరిగితే ఏ శాఖది రెస్పాన్సిబులిటీ అనేది తెలియడంలేదు. ఈ అనుమానాలను సీఎం కేసీఆర్ ఈ మధ్య ధరణిపై జరిగిన రివ్యూ మీటింగ్‌లో వ్యక్తం చేసినట్టు తెలిసింది. భవిష్యత్‌లో ఏమైనా సమాచారాన్ని యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఎవరి అనుమతితో చేయాలనే విషయంపై స్పష్టత లేదు. దీంతో ఊర్లలో ఆస్తుల కోసం ధరణి, పట్నాలు, సిటీల కోసం స్పెషల్‌ పోర్టల్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది.

పేరు కోసం పరిశీలన

అర్బన్ ఏరియాల్లో ఆస్తుల వివరాల కోసం ఏర్పాటు చేయనున్న పోర్టల్‌కు పేరు కోసం సర్కార్‌ వెతుకుతోంది. ధరణి లెక్క మూడు అక్షరాల పేరు ఉండాలని, ప్రజలను అట్రాక్ట్ చేసేలా ఉండే పేరు కోసం వెతుకుతున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు.