సరైన మాడ్యూల్స్​ తెస్తేనే భూ సమస్యలకు పరిష్కారం

సరైన మాడ్యూల్స్​ తెస్తేనే భూ సమస్యలకు పరిష్కారం

సరైన మాడ్యూల్స్​ తెస్తేనే భూ సమస్యలకు పరిష్కారం
ప్రస్తుతం ఉన్న మాడ్యూల్స్​లోనూ మార్పులు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన కలెక్టర్లు

హైదరాబాద్​, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్​లో సరైన మాడ్యూల్స్​ తెచ్చిన తర్వాతే రెవెన్యూ సదస్సులు పెట్టి దరఖాస్తులు తీసుకుంటే ఫలితం ఉంటుందని, లేకపోతే కష్టమని ప్రభుత్వానికి కలెక్టర్లు స్పష్టం చేశారు. కొన్ని అప్లికేషన్లకు ఫీల్డ్​ఎంక్వైరీ తప్పనిసరి కావడం, దీనికి సిబ్బంది లేకపోవడం కూడా సమస్యగా మారిందని తెలిపారు. మొన్నటి వరకు అనేక రకాలుగా దరఖాస్తులు తీసుకున్నప్పటికీ అవి పరిష్కారం కాకపోగా.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పూర్తి స్థాయిలో ధరణి మాడ్యూల్స్​ అందుబాటులోకి లేకపోవడం, ఒకేసారి రైతులు దరఖాస్తులతో పోటెత్తితే ఏం జరుగుతుందోనన్న భయంతో రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం వాయిదా వేసిందనే చర్చ అధికార వర్గాల్లో నడుస్తున్నది. రెవెన్యూ సదస్సులు ఎలా పెట్టాలి? ధరణిలో ఉన్న మాడ్యూల్స్​.. ఇంకా చేపట్టాల్సిన మార్పులపై సీఎస్​ సోమేశ్​కుమార్​ కలెక్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం ధరణిలో 33 రకాల ట్రాన్సాక్షన్​ మాడ్యూల్స్​తో పాటు మరో 11 రకాల ఇన్​ఫర్మేషన్​ మాడ్యూల్స్​ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఇంకా అనేక మాడ్యూల్స్​ రావాల్సి ఉందని కలెక్టర్లు తెలిపారు.  

ఇవి ఎట్లా చేయాలో చెప్పండి..

అగ్రికల్చర్​ అసైన్డ్​ ల్యాండ్స్  సక్సెషన్ , విస్తీర్ణంలో మార్పులు చేర్పులు, మిస్సింగ్​ సర్వే నెంబర్లు వంటి అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. ధరణి కంటే ముందు అన్​ సైన్డ్​ అయిన అసైన్డ్​ ల్యాండ్స్​ డిజిటల్​ సైన్​ కోసం అప్లై చేసుకునేందుకు చాన్స్​ లేదు. ఫలితంగా అసైన్డ్​ ల్యాండ్స్​ పాసు పుస్తకాలు తీసుకోలేకపోతున్నారు. దీనిపై కూడా స్పష్టమైన మాడ్యూల్​ రావాలి. 

కలెక్టర్​ లాగిన్​కు వచ్చిన అప్లికేషన్లు 14 రోజు ల్లో పరిష్కారించాలి. దీనికోసం నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైన ఎంక్వైరీ చేసి దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. అయితే కలెక్టర్లు రోజువారీ పనుల బిజీ వల్ల దరఖాస్తులకు నెలలు గడుస్తున్నా మోక్షం కలగడం లేదు. ఈ గడువును పెంచాలని కలెక్టర్లు కోరుతున్నారు. లేదంటే కొన్ని ధరణి పనులు ఇతర ఆఫీసర్లకు అప్పగించాలని సూచిస్తున్నారు. 

విస్తీర్ణంలో మార్పులు, చేర్పులకు సంబంధించి తీవ్ర గందరగోళంలో నెలకొంది. ఒక పట్టాదారుకు ఉన్నదానికంటే తక్కు వ విస్తీర్ణం పాసుపుస్తకంలో నమోదైతే.. అదే సర్వే నెంబర్​లో ఉన్న ఇతర పట్టాదారులకు ఎలాంటి ఎఫెక్ట్​ లేకుంటే దాన్ని కలెక్టర్​ నిర్ణయం తీసుకుని చేయొచ్చు. ఇందుకోసం ధరణి, ఐఎల్​ఆర్​ఎంఎస్​, వెబ్​ ల్యాండ్​ ఆధారంగా చేయాల్సి ఉంటుంది. అయితే ఇతర పట్టాదారుల సర్వే నెంబర్​లో ఉన్నదానికంటే ఎక్కువ విస్తీర్ణం నమోదైనట్లయితే దానిని తొలగించి ఎవరికి చెందాలో వారికి ఇవ్వడానికి ఇబ్బందులు వస్తున్నాయి. ఇందుకోసం ఎక్కువ విస్తీర్ణం నమోదైన పట్టాదారు స్వయంగా తనకు ఎక్కువ విస్తీర్ణం వచ్చిందని ఆన్​లైన్​లో రూ.1,000 కట్టి అప్లై చేసుకుంటేనే తొలగిస్తారు. ఇందుకోసం ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి విషయాల్లో సుమోటోగా స్వీకరించి మార్పులు, చేర్పులు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కలెక్టర్లు కోరుతున్నారు. 

    నాలా నుంచి అగ్రికల్చర్​కు కన్వర్షన్ కోసం మాడ్యూల్​ తెచ్చినప్పటికీ దాంట్లో ఎలాంటి సర్వే నెంబర్లు చూపెట్టడం లేదు. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో మాడ్యూల్స్​ తెచ్చిన తర్వాతే రెవెన్యూ సదస్సులు పెట్టి, దరఖాస్తులు తీసుకోవడం బెటర్​ అని కలెక్టర్లు ప్రభుత్వానికి తెలిపారు.