
పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ పోవుడు ఖాయమని, రైతుబంధు మాయమవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘కేసీఆర్ కు ఏం పని లేదు. 24 గంటలు కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తున్నడని పీసీసీ అధ్యక్షుడు అంటున్నడు. ఇంతకుముందు అమెరికాలో చెప్పిండు.. ఇక్కడ టీవీ స్టూడియోలో కూడా బల్ల గుద్ది చెప్తున్నడు. 10 హెచ్‌పీ మోటార్ పెట్టుకుంటే గంటకు ఎకరం పొలం పారుతది.. మూడు గంటల కరెంట్‌చాలు అంటున్నడు. రైతుల దగ్గర ఎక్కడన్న 10 హెచ్‌పీ మోటార్ ఉంటదా? 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటార్లు ఉంటయ్.
10 హెచ్‌పీ మోటార్ ఎవడు కొనియ్యాలె.. వీని అయ్య కొనిస్తడా? తెలంగాణలో 32 లక్షల మోటార్లు ఉన్నయ్. ఇన్ని మోటార్లు ఎవడు కొనాలె’’ అని రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. మంగళవారం మహబూబాబాద్జిల్లా తొర్రూరు, నల్గొండ జిల్లా హాలియా, ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడారు. ‘‘రైతుబంధు వృథా అని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నడు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు మాయమవుతుంది. అదే బీఆర్ఎస్ గెలిస్తే రైతుబంధు 16 వేలు అవుతుంది. రైతుబంధు ఇచ్చేటోడు ఉండాల్నా.. రైతుబంధు దుబారా అన్నోడు ఉండాల్నా? అనేది ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి” అని ఆయన అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ మాయమాటలకు మోసపోతే ఐదేండ్లు గోస పడక తప్పదని ప్రజలను కేసీఆర్ హెచ్చరించారు. ఒక్క చాన్స్ఇవ్వాలని కాంగ్రెస్నాయకులు అంటున్నారని, గతంలో అనేక చాన్స్‌లు ఇస్తే వాళ్లేం చేశారని ప్రశ్నించారు. ‘‘అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నరు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తది. రైతుబంధు కోసమే ధరణి తెచ్చాం. ధరణి వద్దంటున్న కాంగ్రెస్ నే గంగలో కలపాలి” అని పిలుపునిచ్చారు.
‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగు నీటి వనరులు పెంచాం. 24 గంటల ఉచిత విద్యుత్ఇస్తున్నాం. వ్యవసాయానికి చేయూత ఇవ్వడం వల్లే తెలంగాణ పచ్చబడింది. మన పొలాల్లో నాట్లు వేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు. గత ప్రభుత్వాలు 75 ఏండ్లలో తాగు నీటిని కూడా అందించలేదు. మేంమిషన్భగీరథ స్కీమ్ ద్వారా ఇంటింటికీ కృష్ణా, గోదావరి జలాలను అందించాం” అని చెప్పారు.
బయటోళ్లకు అవకాశమిస్తే టోపీ పెడ్తరు..
మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన బంధు అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చామని తెలిపారు. ‘‘నోముల భగత్ఎమ్మెల్యే అయ్యే వరకు నాగార్జునసాగర్‌లో ఒక్క డిగ్రీ కాలేజీ లేదు. హాలియాలో 50 బెడ్ల ఆసుపత్రి దిక్కులేదు. ఉప ఎన్నికల్లో భగత్ గెలిచిన తర్వాత అవన్నీ నెరవేరాయి. నాగార్జునసాగర్ కాలువ కింద కాంగ్రెస్ గవర్నమెంట్ లో రైతుల ముక్కు పిండి నీటి తీరువా వసూలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నీటి తీరువా రద్దు చేసి, బకాయిలను మాఫీ చేశాం.
పాలకుర్తి పోరాటాల గడ్డ. ఈ నేలపై చాకలి ఐలమ్మ, షేక్‌బందగీ, దొడ్డి కొమురయ్య వంటి యోధులు పుట్టారు. సేవ ముసుగులో అమెరికా నుంచి వచ్చిన వారికి అవకాశం ఇస్తే, టోపీ పెట్టి పోవడం ఖాయం” అని అన్నారు. చరిత్రలో కనీవిని ఎరుగని పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
సీఎం కావాలని జానారెడ్డి కలలు కంటున్నడు..
సీఎం కావాలని జానారెడ్డి పంచరంగుల కలలు కంటున్నారని కేసీఆర్ విమర్శించారు. ఆయన హయాంలో నాగార్జునసాగర్‌లో నాలుగు రోడ్లు తప్ప, పెద్దగా అభివృద్ధి జరగలేద న్నారు. ‘‘తెలంగాణలో రెండేండ్లలో 24 గంటల కరెంట్ ఇస్తానని ఆనాడు అసెంబ్లీలో చెబితే, అప్పటి ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి రెండేండ్లలో కాదు.. నాలుగేండ్లలో ఇచ్చినా గులాబీ కండువా కప్పుకుంటానన్నడు. నేను ఇచ్చిన మాట మీద నిలబడి రెండేండ్లలో 24 గంటల కరెంటు ఇచ్చిన. కానీ జానారెడ్డి మాట మీద నిలబడలేదు” అని అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగు నీటి వనరులు పెంచాం. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వ్యవసాయానికి చేయూత ఇవ్వడం వల్లే తెలంగాణ పచ్చబడింది. మన పొలాల్లో నాట్లు వేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు. గత ప్రభుత్వాలు 75 ఏండ్లలో తాగు నీటిని కూడా అందించలేదు. మేంమిషన్ భగీరథ స్కీమ్ ద్వారా ఇంటింటికీ కృష్ణా, గోదావరి జలాలను అందిస్తున్నాం.
- సీఎం కేసీఆర్