ధరణి స్థానంలో మీ భూమి...మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ

ధరణి స్థానంలో మీ భూమి...మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ

హైదరాబాద్, వెలుగు: అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర సర్కారు అవినీతిపై విచారణకు కమిషన్ ​వేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టినట్లు తెలుస్తున్నది. ధరణి స్థానంలో ‘మీ భూమి’ యాప్​ తెస్తామని, నిజాం షుగర్​ఫ్యాక్టరీ పునరుద్ధరణ, గల్ఫ్​ దేశాల్లో తెలంగాణ భవన్​ల ఏర్పాటు, మహిళా రైతు కమిషన్​లాంటి కీలక అంశా లనూ చేర్చినట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే మేనిఫెస్టోపై కసరత్తు పూర్తి చేసినప్పటికీ.. హైకమాండ్​ ఆదేశాల మేరకు శుక్రవారం కొన్ని కీలక హామీలను అందులో పొందుపరిచినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

నేడు మధ్యాహ్నం హైదరాబాద్​కు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్​షా.. ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేయడంతో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం12 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి హెలికాప్టర్​లో గద్వాల సభకు వెళ్తారు. ఆ తర్వాత నల్గొండ సభలో, సాయంత్రం వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో జరిగే సభలో పాల్గొననున్నారు. 

సాయంత్రం 5.45 గంటలకు హైదరాబాద్​లోని హోటల్ కత్రియాలో బీజేపీ మెనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం సికింద్రాబాద్​లోని క్లాసిక్ గార్డెన్​లో ఎమ్మార్పీఎస్ నేతల తో భేటీ కానున్నారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని షా ఆ వర్గాన్ని కోరనున్నట్లు తెల్సింది. రాత్రి 8 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి అహ్మదాబాద్ కు వెళ్తారు.