నీట్ యూజీ పేపర్ లీక్ నిజమే.. పరీక్ష నిర్వహణలో NTA ఫెయిల్: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

నీట్ యూజీ పేపర్ లీక్ నిజమే.. పరీక్ష నిర్వహణలో NTA ఫెయిల్: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

న్యూఢిల్లీ: నీట్ యూజీ పేపర్ లీక్‎ ఇష్యూపై కేంద్ర విద్యా శాఖ మంత్ర ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ యూజీ ఎగ్జామ్‎లో అవకతవకలు జరిగాయని.. ప్రశ్నపత్రం నిజంగానే లీక్ అయిందని అంగీకరించారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‎టీఏ) ఫెయిల్ అయ్యిందన్నారు. శుక్రవారం (మే 29) కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ నేషనల్ మీడియా టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘‘నీట్ యూజీ పేపర్ లీక్ అయిందని అంగీకరిస్తున్నాను. ఎన్‌టీఏ విఫలమైంది. ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.  

వైద్య ప్రవేశ పరీక్ష సమగ్రతను దెబ్బతీస్తున్న విద్యా మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడానికి మోడీ సర్కార్ కట్టుబడి ఉందని అన్నారు. పేపర్ లీకేజీలో పాలుపంచుకున్న వ్యవస్థీకృత నెట్‌వర్క్‌లపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని విద్యార్థులకు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. పేపర్ లీక్‌లో ప్రమేయం ఉన్న వారెవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నీట్ పేపర్ లీక్‌కు సంబంధించిన అన్ని కేసులను ఫాస్ట్-ట్రాక్ కోర్టులలో విచారిస్తామని.. తద్వారా నిందితులకు త్వరితగతిన  కఠిన శిక్ష పడేలా చూస్తామని పేర్కొన్నారు. 

సీబీఎస్ఈ అంశంపై మంత్రి ఏమన్నారంటే..?

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. సీబీఎస్ఈ మూల్యాంకన వ్యవస్థలో ఓఎస్ఎంకు సంబంధించిన సాంకేతిక సమస్యలతో సహా పలు సమస్యలు ఉన్నాయని అంగీకరించిన ఆయన.. వాటిని ప్రస్తుతం ఐఐటీ నిపుణుల సహాయంతో పరిష్కరిస్తున్నారని తెలిపారు. సీబీఎస్ఈ ఉపయోగించే పేమెంట్ గేట్‌వే విదేశీ హ్యాకర్ల నుంచి జరిగిన సైబర్‌దాడికి గురైందని హాట్ కామెంట్స్ చేశారు.

 ఈ సమస్యను పరిష్కరించి, వ్యవస్థను బలోపేతం చేయడంలో సీబీఐ సైబర్ బృందం సీబీఎస్ఈకి సహకరిస్తోందని తెలిపారు.11 లక్షలకు పైగా విద్యార్థులు ఇప్పటికే తమ జవాబు పత్రాల కాపీలను పొందగా.. నాలుగు లక్షలకు పైగా అభ్యర్థులు పునఃమూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని.. ప్రక్రియను మెరుగుపరచడానికి అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.