ఢిల్లీ: NEET పేపర్ లీక్, విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై కేంద్రం సమాలోచనలు చేస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం గానీ, కేంద్ర ప్రభుత్వం ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించే ఆలోచనలో గానీ లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. పరీక్షా పత్రాల లీకేజీకి ఆయనను బాధ్యుడిని చేయలేమని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండటమే ఇందుకు కారణం.
మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కేబినెట్లోనే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే.. NEET బాధితులకు సాయం చేయాలని కేంద్రం యోచనలో ఉంది. NEET పేపర్ లీక్ కారణంగా, తదనంతర పరిణామాల కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌పై కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల అనుమతి లేకుండానే బుధవారం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిరసనకారులు పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహించేందుకు ప్రయత్నించారు.
ALSO READ : ఢిల్లీలో స్టూడెంట్స్ చేస్తోంది తప్పైతే.. 30 ఏళ్ల క్రితం ధర్మేంద్ర ప్రధాన్ చేసిందేంటి..?
ఈ క్రమంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో సెంట్రల్ ఢిల్లీలోని టాల్‌స్టాయ్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేశారు. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.
