ఈఎస్ఐ డైరెక్టరేట్ ఆఫీస్ ​ఎదుట.. స్టాఫ్ నర్సుల ధర్నా

ఈఎస్ఐ డైరెక్టరేట్ ఆఫీస్ ​ఎదుట.. స్టాఫ్ నర్సుల ధర్నా
  •    జీతాలు పెంచకుంటే 
  •     17 నుంచి సమ్మె చేస్తామని నోటీసు

పద్మారావునగర్, వెలుగు: ఈఎస్ఐ డైరెక్టరేట్​పరిధిలోని ఔట్​ సోర్సింగ్ ​స్టాఫ్​ నర్సులకు.. ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేస్తున్న ఔట్​ సోర్సింగ్​ స్టాఫ్​
నర్సులతో సమానంగా జీతాలివ్వాలని డిమాండ్​ చేస్తూ గురువారం భోలక్​పూర్​లోని ఈఎస్ఐ డైరెక్టరేట్ ఆఫీస్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఈఎస్ఐ వింగ్ (ఏఐటీయూసీ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ యూసుఫ్, ఎం నరసింహ మాట్లాడుతూ.. గత 15 ఏండ్లుగా ఈఎస్ఐ డైరెక్టరేట్​పరిధిలోని నాచారం, ఆర్సీ పురం, జీడిమెట్ల, వరంగల్ జేడీ, హైదరాబాద్​ జేడీ పరిధిలో 300 మంది నర్సింగ్​ సిబ్బంది ఔట్​సోర్సింగ్​ పద్ధతిలో పనిచేస్తున్నారని, వీరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఔట్​సోర్సింగ్​ సిబ్బందికి ఇస్తున్నట్లుగా రూ.32,368 కాకుండా, కేవలం రూ.22,750 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.

ఈ విషయంపై రెండేండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నామన్నారు. ఈఎస్ఐ డైరెక్టరేట్​లోని ఆఫీసర్ల నిర్లక్ష్యంతో వారి జీతాలు పెరగడం లేదన్నారు. వెంటనే జీతాలు పెంచాలని, లేకుంటే ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని నర్సులు హెచ్చరించారు. అనంతరం ఈఎస్ఐ అసిస్టెంట్​ డైరెక్టర్​బాలాజీకి సమ్మె  నోటీసు అందజేశారు.

తమకు కూడా పీఆర్సీ వర్తింపజేయాలని, 35 క్యాజువల్​ లీవులు ఇవ్వాలని, ఏరియర్స్​తో కూడిన జీతాల పెంపు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వెంకటరాజ్యం, బొడ్డుపల్లి కిషన్, నర్సింగ్​ సిబ్బంది నాగమణి, మేరీ, సుమలత, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.