డిండి నుంచి నీళ్లు ఆపాలని ధర్నా

డిండి నుంచి  నీళ్లు  ఆపాలని ధర్నా

 డిండి, వెలుగు: డిండి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల వెంటనే ఆపాలని కోరుతూ మంగళవారం మండల పరిధిలోని రైతులు ఇరిగేషన్ ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని డిండి, చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లోని చెరువులు, కుంటలను నింపడానికి సోమవారం ఇరిగేషన్ అధికారులు డిండి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. దీనివల్ల ప్రాజెక్టు ఖాళీ అయి నీరు వృథా అవుతుందని, ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీటిని ఆపాలని వారు కోరారు. 

నీటిని విడుదల చేయాలని రైతులు కోరలేదని, ఇప్పుడు నీటిని వృధా చేయకుండా వానాకాలం సీజన్ లో ఉపయోగపడేలా చూడాలని కోరుతూ వారు డీఈ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. నీటి విడుదల ఆపకపోతే ఆందోళన చేస్తామన్నారు. రైతుల ఆందోళనతో నీటి ఫ్లో తగ్గించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని డీఈ శ్రీనివాసులు చెప్పారు.