బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల చేయాలంటూ..

బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల చేయాలంటూ..
  • ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా
  • ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం
  • టెన్త్ క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ ను బహిష్కరించేందుకు వెనుకాడం: ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ

హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు,  పదోన్నతుల  షెడ్యూల్ ను  వెంటనే విడుదల చేయాలని  ఉపాధ్యాయ  సంఘాల  పోరాట  కమిటీ అధ్యక్షుడు  హరికిషన్ డిమాండ్ చేశారు.  317 జీవో  బాధిత ఉపాధ్యాయుల  అప్పిల్స్ ను  పరిష్కరించాలన్నారు.  సర్వీస్  ప్రొటెక్షన్ తో  పరస్పర బదిలీల  ఉత్తర్వులు  విడుదల  చేయాలన్నారు. గత ఏడేళ్లుగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  హైదరాబాద్  కలెక్టరేట్  ముందు  ఉపాధ్యాయ సంఘాల  పోరాట కమిటీ  ఆధ్వర్యంలో  ధర్నాకు దిగారు.  ధర్నా చేపట్టేందుకు వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు  అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల  31న ఇందిరా పార్క్  దగ్గర  అన్ని జిల్లాల  ఉపాధ్యాయులతో  మహాధర్నా నిర్వహిస్తామని  హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడేళ్లు అయినా ఉపాధ్యాయులు ప్రమోషన్లు లేక చాలా ఇబ్బందిపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయంగా దక్కాల్సిన ప్రమోషన్లు కల్పించడం లేదన్నారు. చాలా మంది ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే రిటైర్ అయిపోతున్నారని.. ఇంకా వేల మంది రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నారని.. ఏకీకృత సర్వీస్ రూల్స్ అని చెప్పి ఎవరికీ ప్రమోషన్లు ఇవ్వకుండా పెండింగులో పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం స్పందించకపోతే తమ నిరసనను తీవ్ర స్థాయిలో తెలియజేసేందుకు ఈనెల 31వ తేదీన ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని.. అప్పటికీ స్పందన లేకపోతే.. జూన్ 2న టెన్త్  క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ ను   బహిష్కరించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. 

ఉపాధ్యాయుల డిమాండ్లు:

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలి.

317 బాధిత ఉపాధ్యాయుల అన్ని రకాల అప్పీల్స్ వెంటనే పరిష్కరించాలి.

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే.. 2 శాతం చందా సరైనది కాదు.

సర్వీస్ ప్రొటెక్షన్స్ తో పరస్పర బదిలీల ఉత్తర్వులు విడుదల చేయాలి.

 

 

 

ఇవి కూడా చదవండి

వృక్ష‌మాత‌ తిమ్మ‌క్కను స‌న్మానించిన సీఎం కేసీఆర్

కరీంనగర్​లో నీళ్ల గోస నిజమే

లండన్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం