కరీంనగర్​లో నీళ్ల గోస నిజమే

కరీంనగర్​లో నీళ్ల గోస నిజమే
  • కొత్త పైపులైన్ల కోసం తీర్మానించినా టెండర్లు పిలవలే
  • ఇతర డివిజన్లలో పూర్తి కావచ్చిన పనులు
  • డివిజన్​లో పర్యటించిన కలెక్టర్, అడిషనల్ ​కలెక్టర్, కమిషనర్​

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ కార్పొరేషన్​లో నీటి యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీ కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో తన డివిజన్ లో నీళ్లు రావడంలేదని ఖాళీ బిందె, బకెట్ తో నిరసన తెలిపింది. దీనిపై స్పందించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కొందరు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని మాట్లాడారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న కమల్ జిత్ కౌర్ సోమవారం ప్రజవాణిలో తన కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరారు. కేటీఆర్ వాఖ్యలపై ప్రతిస్పందిస్తూ తన డివిజన్ లో తాగునీళ్లు వస్తున్నాయని రుజువు చేస్తే కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తానని.. కావాలంటే ఇంటెలిజెన్స్​రిపోర్ట్​ తెప్పించుకోవాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. అయితే కౌర్​సవాల్ ను ప్రజాప్రతినిధులు స్వీకరించలేదు. కలెక్టర్​తో పాటు ఇతర ఉన్నతాధికారులు మాత్రం డివిజన్​ను విజిట్​ చేసి నీటి సమస్య గురించి వాకబు చేశారు.  

పక్క గల్లీల నుంచి తెచ్చుకుంటున్నరు

49వ డివిజన్ ఇటు కమాన్.. అటు టవర్ కు నడుమ ఉంటుంది. శాస్త్రి  రోడ్ నుంచి బోయవాడకు వచ్చే రోడ్.. అక్కడి నుంచి భారత్ టాకీస్ చౌరస్తా వరకు సుమారుగా నాలుగు గల్లీల్లోని 100 ఇండ్లకు నీళ్లు సరిగ్గా రావడం లేదు. ఈ సమస్య ఐదు నెలల నుంచి ఉంది. కొన్ని ఇండ్లల్లో సన్నధారలా వస్తే..మరికొన్ని ఇండ్లల్లో మొత్తానికే రావట్లేదు. వచ్చినా 20 నిమిషాల కంటే ఎక్కువగా రావు. ఇంత తక్కువ టైంలో సంప్​నిండే చాన్స్​ లేకపోవడంతో నీళ్లు పడుతుండగానే పట్టుకుంటున్నారు. కొన్నిసార్లు రంగు మారి వస్తున్నాయని, పురుగులు, చెత్తచెదారం కూడా కనిపిస్తున్నాయని కాలనీవాసులు చెబుతున్నారు. చాలా వరకు ఈ ఏరియాల్లో రెండు మూడు అంతస్తుల బిల్డింగులే ఉన్నాయి. దీంతో ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లకు సరిగ్గా నీళ్లు రావడం లేదు. దీంతో పబ్లిక్ ట్యాప్ దగ్గరకు కొందరు, పక్క గల్లీలకు మరికొందరు వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు.   

49వ డివిజన్​లోనే ఎందుకిలా? 

శాస్త్రి రోడ్ లో గతంలో ఒక వైపు మాత్రమే పైప్ లైన్ ఉండేది. స్మార్ట్ సిటీలో భాగంగా రోడ్డు విస్తరణ టైమ్ లో రెండు వైపులా పైపు లైన్లు వేశారు. 49వ డివిజన్ కు వచ్చే దగ్గర వంకరటింకరగా వేయడంతో నీళ్లు సరిగ్గా రాలేదు. దీంతో కార్పొరేటర్ ఫిర్యాదు చేయడంతో తవ్వి సరిచేశారు. 49వ డివిజన్ కు నీళ్లు వచ్చే వైపు 8 ఇంచుల మెయిన్ పైపు లైన్ వేయగా, 47వ డివిజన్​వైపు10 ఇంచుల మెయిన్ లైన్ వేశారు. దీంతో పాటు 47 వ డివిజన్​లో 6 ఇంచుల కొత్త ఇంటర్నల్ పైపులు వేస్తే 49వ డివిజన్ కు వచ్చే ఏరియాల్లో కొత్త ఇంటర్నల్​లైన్లు వేయకుండా 3 ఇంచుల పాత లైన్లకే కనెక్షన్ ఇచ్చి వదిలేశారు. దీంతో ఇటువైపు నీళ్లు రావడం తగ్గాయి. ఇంతకు మునుపు రెగ్యులర్ గా రెండు గంటల పాటు నీళ్లు ప్రెషర్​తో వచ్చేవి. రెండు, మూడు అంతస్తులకైనా నీళ్లు ఎక్కేవి. కానీ ఇప్పుడు సన్నని ధారాలా, 20 నిమిషాలే  వస్తున్నాయి.

తీర్మానాలైనా టెండర్లు లేవు.

49వ డివిజన్ లో తాగునీటి సమస్య పరిష్కారానికి కొత్త పైపులైన్లు వేయడానికి గతంలోనే జనరల్ బాడీ మీటింగ్ లో తీర్మానాలు చేశారు. సుమారు రూ.35 లక్షలతో వర్క్స్​చేయడానికి రెండు నెలల కిందే నిర్ణయం తీసుకున్నారు. కానీ అధికారులు మాత్రం టెండర్లు పిలవడం లేదు. కార్పొరేటర్ కమల్​జిత్​ కౌర్​ ఏఈ నుంచి మొదలుకుని ఈఈ వరకు ఎందరో ఆఫీసర్లను కలిసి సమస్య చెప్పారు. అయినా స్పందన కనిపించలేదు. ఈ డివిజన్​తో పాటు తీర్మానాలు చేసిన ఇతర డివిజన్లలో టెండర్లు పిలిచి పనులు కూడా పూర్తి చేస్తున్నారు. 49వ డివిజన్​ను మాత్రం పట్టించుకోవడ ంలేదు. దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్న కూతురు కావడం కూడా ఇలా జరగడానికి కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి.  

కౌర్​దెబ్బకు కదిలిన యంత్రాంగం

డివిజన్ లో నీటి సమస్య రగులుతుండడంతో మంగళవారం కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ తో పాటు లోకల్​ బాడీస్ ​అడిషనల్​ కలెక్టర్​ గరిమా అగర్వాల్​ డివిజన్​లో ఆకస్మికంగా పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ తో పాటు ఎస్ఈ, డీఈ, ఏఈలు..నీటి సరఫరా విభాగానికి చెందిన లైన్ మెన్లు, ఫిట్టర్లు కూడా డివిజన్ వైపు కదిలారు. ఈ సందర్భంగా ఇంకా ఎన్ని రోజులు నీళ్ల కోసం ఇబ్బందులు పడాలంటూ మహిళలు నిలదీశారు. దీంతో నీటి సమస్య ఎందుకు వస్తోందంటూ సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పైపు లైన్ కావడంతో చెత్త, వేర్లు తట్టుకోవడం వల్ల ప్రెషర్ రావడం లేదని సమాధానమిచ్చారు.  వీరికన్నా ముందు ఉదయమే ఇంటెలిజెన్స్​ఆఫీసర్లు కాలనీలో తిరిగి సమస్య గురించి ఆరా తీశారు. 

నీళ్లు వస్తున్నాయని నిరూపిస్తే రాజీనామా చేస్తా

మా డివిజన్ లో కావాలనే నీళ్లు రాకుండా చేస్తున్నరు. తీర్మానాలు అయినా టెండర్లు పిలవకపోవడం వెనక ఆంతర్యం ఏమిటి? కేటీఆర్ మాత్రం డివిజన్​లో నీళ్లు వస్తున్నా..నేనే కావాలని చేస్తున్నానని అంటున్నరు. నిజాలు ఏమిటో ఇంటెలిజెన్స్​తో సర్వే చేయించి తెలుసుకోవాలి. మా కాలనీ వాసులకు సరిపడా నీళ్లు వస్తున్నాయని తేలితే కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తా. సోమవారం కలెక్టర్ కు ప్రజవాణిలో సమస్య గురించి దరఖాస్తు ఇచ్చిన. పరిష్కరించకపోతే హెచ్ఆర్సీకి పోత.  

-  కమల్ జిత్ కౌర్, 49 వ డివిజన్ కార్పొరేటర్