పోలీసులు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట

పోలీసులు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట

రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ భృతి, గ్రూప్2 పరీక్ష వాయిదాపై బీజేవైఎం ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అయితే బీజేవైఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేవైఎం కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్-2 పరీక్షకు.. 3 నెలల సమయం ఇవ్వాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ కోరారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి.. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. ఇకనుంచి అయినా నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డ్ నోటిఫికేషన్లు, పరీక్షలు, నియమాలను తప్పుల తడకగా మార్చి నిరుద్యోగులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులను ఇలాంటి ఒత్తిడిలకు గురి చేస్తున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్రృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలు, ధర్నాలతో సెక్రటేరియట్, ప్రగతిభవన్ ని ముట్టడిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.