బీఆర్ఎస్ ధర్నా .. జనం లేక వెలవెల

బీఆర్ఎస్ ధర్నా .. జనం లేక వెలవెల

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు విడుదల చేయకుండా వివక్ష చూపడాన్ని నిరసిస్తూ ములుగు జిల్లా కలెక్టరేట్ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితర నాయకులంతా ధర్నా కోసం భారీగా టెంట్లు వేసి ఏర్పాట్లుచేశారు. కానీ, ధర్నాకు అనుకున్నంతగా జనాధరణ రాకపోవడంతో ధర్నా కార్యక్రమం వెలవెలబోయింది. దీంతో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఉన్న కొద్దిపాటి జనంతోనే ధర్నాని ప్రారంభించారు. ఆయనతోపాటు జడ్పి చైర్మన్ కుసుమ జగదీష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు జన సమీకరణ సరిగా చేయకపోవడంతో ఎమ్మెల్సీ సారయ్య అసహనం వ్యక్తం చేశారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోను బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. నిర్మల్ లోని జయశంకర్ చౌరస్తాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంఎల్ ఏలు, బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఆందోళనల్లో పాల్గొన్నారు. రైతు కల్లాల నిర్మాణానికి ఉపాధి హామీ పనుల నిధులు వాడితే తప్పేంటని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రం కావాలనే తెలంగాణ సర్కార్ పై కుట్ర చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేశారు.