అనారోగ్యంతో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే మృతి.. 1985 లో అజ్మీరా గోవింద్ నాయక్ తొలిసారి ఎమ్మెల్యే

అనారోగ్యంతో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే మృతి.. 1985 లో అజ్మీరా గోవింద్ నాయక్ తొలిసారి ఎమ్మెల్యే

దండేపల్లి, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా ఖానాపూర్  నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద్  నాయక్(71) సోమవారం చనిపోయారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ లోని ఆయన సొంత ఇంట్లో అనారోగ్యంతో కన్నుమూశారు.

1985లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన మొదటి ప్రయత్నంలోనే ఖానాపూర్  ఎమ్మెల్యే గా ఇండిపెండెంట్  అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తరువాత టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందగా, తెలంగాణ మలి ఉద్యమంలో  కేసీఆర్ తో కలిసి కీలక పాత్ర పోషించిన ఆయన 2004లో టీఆర్ఎస్​ నుంచి భారీ మెజార్టీతో గెలిచారు.

ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాకు ఎప్పుడు వచ్చినా లింగాపూర్ లోని గోవింద్ నాయక్  ఇంట్లో కేసీఆర్​ బస చేసేవారు. ముఖ్య నాయకులతో ఉద్యమ కార్యాచరణపై మంతనాలు జరిపేవారు. ఆయనకు భార్య అనూష నాయక్, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆయన తమ్ముడు హరినాయక్  రాజకీయాల్లో కొనసాగుతున్నారు.