టీమిండియా జట్టులోకి ధవన్, సాహా

టీమిండియా జట్టులోకి ధవన్, సాహా

ఎన్నో ఊహలు.. మరెన్నో చర్చలు.. ప్రపంచకప్‌‌ తర్వాత టీమిండియా ఆడనున్న తొలి సిరీస్‌‌ కావడంతో  వెస్టిండీస్‌‌ టూర్‌‌కు వెళ్లే జట్టు ఎలా ఉంటుందోనని  అభిమానులు చాలా అంచనాలు వేసుకున్నారు. కానీ అంచనాలకు అందకుండా ఈసారి కూడా ఎమ్మెస్కే ప్రసాద్‌‌ నేతృత్వంలోని సెలెక్షన్‌‌ కమిటీ సంచలనాత్మక నిర్ణయాలు లేకుండానే ఆదివారం టీ20, వన్డే, టెస్ట్‌‌ సిరీస్‌‌లకు జట్లను ప్రకటించింది. వరల్డ్‌‌కప్‌‌లో గాయపడ్డ ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ పూర్తి ఫిట్‌‌నెస్‌‌తో రీ ఎంట్రీ ఇవ్వనుండగా, హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ మళ్లీ టెస్ట్‌‌ల్లో కనిపించనున్నాడు. 2018 డిసెంబర్‌‌లో ఆసీస్‌‌పై చివరి టెస్ట్‌‌ ఆడిన ఈ ముంబైకర్‌‌.. వరల్డ్‌‌కప్‌‌లో పరుగుల వరద పారించడం కలిసొచ్చింది. ఇక టీ20ల్లో స్పిన్నర్‌‌ రాహల్‌‌ చహర్‌‌కు, సైనీకి టీ20, వన్డేల్లో అవకాశం ఇవ్వడం కొత్త నిర్ణయం.  లిమిటెడ్‌‌ ఓవర్స్‌‌ సిరీస్‌‌కు విరాట్‌‌కు విశ్రాంతి ఇచ్చి రోహిత్‌‌కు పగ్గాలు అప్పగిస్తారని అనుకున్నా.. మూడు ఫార్మాట్లకు కోహ్లీనే సారథిగా ప్రకటించారు. లోకేశ్‌‌ రాహుల్‌‌ మూడు జట్లలో స్థానం నిలుపుకున్నాడు. గాయాల నుంచి కోలుకోకపోవడం వల్ల విజయ్‌‌ శంకర్‌‌, పృథ్వీ షాను పరిగణనలోకి తీసుకోలేదు.

సాహాకు పిలుపు 

ధోనీ వారసుడిగా ముద్రపడ్డ రిషబ్‌‌ పంత్‌‌ను అన్ని ఫార్మాట్లలో ఫస్ట్‌‌ చాయిస్‌‌ వికెట్‌‌ కీపర్‌‌గా కొనసాగించాలనేది సెలక్టర్ల టార్గెట్‌‌గా కనబడుతున్నది. అయితే గాయం కారణంగా 2018 నుంచి జట్టుకు దూరంగా ఉన్న వృద్ధిమాన్‌‌ సాహాకు  పిలుపు అందడంతో.. ఐదు రోజల ఫార్మాట్‌‌లో వికెట్‌‌ కీపర్‌‌ ఎవరనే దానిపై సందిగ్ధత నెలకొంది. పంత్‌‌కు బ్యాకప్‌‌గా సాహాను ఎంపిక చేశారా? అన్న ప్రశ్నకు ఎమ్మెస్కే సమాధానం దాటవేశాడు. 2018 జనవరిలో సౌతాఫ్రికాతో చివరి టెస్ట్‌‌ ఆడిన సాహా.. తర్వాత భుజానికి ఆపరేషన్‌‌ చేయించుకున్నాడు. దీనిని నుంచి కోలుకుని ఐపీఎల్‌‌, ముస్తాక్‌‌ అలీ టోర్నీల్లో నిలకడగా రాణించి మళ్లీ జట్టులోకి వచ్చాడు.

వరల్డ్‌‌కప్‌‌ ఓటమి నేపథ్యంలో టీమిండియాలో ప్రక్షాళన మొదలవుతుందని భావించినా..      ఆ దిశగా సంచలనాలేమీ చోటు చేసుకోలేదు..! కరీబియన్‌‌ టూర్‌‌కు ఆశ్చర్యపరిచే ఎంపికలు ఉంటాయనుకున్నా.. సెలెక్టర్లు పెద్దగా పట్టించుకోలేదు..! వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌ దృష్ట్యా కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తారని ఊహించినా.. రెండు కొత్త ముఖాలతో సరిపెట్టారు..! ఓవరాల్‌‌గా ధోనీ రిటైర్మెంట్‌‌, ‘ఇద్దరు కెప్టెన్ల’ వంటి అంశాల జోలికి పోకుండా.. చిన్న చిన్న మార్పులతోనే సెలెక్షన్‌‌ కమిటీ విండీస్‌‌ టూర్‌‌కు టీమిండియాను ప్రకటించింది..! మళ్లీ పాత వాళ్లనే తీసుకుంటూ.. కొత్త వాళ్లను పక్కనబెడుతూ.. సింపుల్‌‌గా మూడు సిరీస్‌‌లకు టీమ్‌‌ను ఎంపిక చేసింది..!

బుమ్రా, పాండ్యాకు విశ్రాంతి

వర్క్‌‌లోడ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌లో భాగంగా పేస్‌‌ స్టార్‌‌ బుమ్రాకు వన్డే, టీ20 సిరీస్‌‌లకు విశ్రాంతి కల్పించారు. విండీస్‌‌తో జరిగే రెండు టెస్ట్‌‌లకు అతను అందుబాటులో ఉండనున్నాడు. ఇక ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యాకు టూర్‌‌ మొత్తం విశ్రాంతి ప్రకటించారు. వన్డేల్లో భువనేశ్వర్‌‌, షమీ పేస్‌‌ విభాగాన్ని నడిపించనున్నారు.  ఖలీల్‌‌ అహ్మద్‌‌, నవ్‌‌దీప్‌‌ సైనీ కొత్తగా టీమ్‌‌లోకి వచ్చారు. టీ20ల్లో భువీ, ఖలీల్‌‌, సైనీకి తోడుగా అన్నదమ్ములు దీపక్‌‌ చహర్‌‌, రాహుల్​ చహర్​ను తీసుకొచ్చారు. టెస్ట్‌‌ల్లో బుమ్రా, షమీకి తోడుగా ఇషాంత్‌‌, ఉమేశ్‌‌ వచ్చారు. వన్డేల్లో మిడిలార్డర్‌‌ బలోపేతం చేస్తామని ప్రకటించిన సెలెక్టర్లు ఆ దిశగా శ్రేయస్‌‌ అయ్యర్‌‌, మనీష్‌‌ పాండేను జట్టులో తీసుకొచ్చారు. వరల్డ్‌‌కప్‌‌లో ఆడిన దినేశ్‌‌ కార్తీక్‌‌ను మొత్తానికే పక్కనబెట్టేశారు. అయితే విండీస్‌‌–ఎతో సిరీస్‌‌లో దుమ్మురేపుతున్న శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ను  సెలెక్టర్లు కరుణించలేదు. ఆల్‌‌రౌండర్‌‌ జడేజా మూడు ఫార్మాట్లలో చోటు నిలుపుకున్నాడు. విజయ్‌‌ శంకర్‌‌కు బ్యాకప్‌‌గా వరల్డ్‌‌కప్‌‌ జట్టులోకి వచ్చిన మయాంక్‌‌ అగర్వాల్‌‌ను టెస్ట్‌‌లకే పరిమితం చేశారు. స్పిన్‌‌ విభాగంలో అశ్విన్‌‌ టెస్ట్‌‌లకు, చహల్‌‌ వన్డేలకు ఎంపికయ్యారు. కుల్దీప్‌‌ ఈ రెండు ఫార్మాట్లలో ఆడనున్నాడు.  విండీస్‌‌తో ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్‌‌ 3 దాకా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌‌లు టీమిండియా ఆడనుంది.

టీ20 జట్టు:  కోహ్లీ (కెప్టెన్‌‌), రోహిత్‌‌ (వైస్‌‌ కెప్టెన్‌‌), ధవన్‌‌, రాహుల్‌‌, శ్రేయస్‌‌ అయ్యర్‌‌, మనీశ్‌‌ పాండే, రిషబ్‌‌ (కీపర్‌‌), క్రునాల్‌‌ పాండ్యా, జడేజా, వాషింగ్టన్‌‌ సుందర్‌‌, రాహుల్ చాహర్‌‌, భువనేశ్వర్‌‌, ఖలీల్, దీపక్‌‌ చహర్‌‌, నవదీప్‌‌ సైనీ.

వన్డే జట్టు: కోహ్లీ(కెప్టెన్‌‌), రోహిత్‌‌ (వైస్‌‌ కెప్టెన్‌‌), ధవన్‌‌, రాహుల్‌‌, శ్రేయస్‌‌ అయ్యర్‌‌, మనీశ్‌‌ పాండే, రిషబ్‌‌ (కీపర్‌‌), జడేజా, కుల్దీప్‌‌, చహల్‌‌, కేదార్‌‌ జాదవ్‌‌, షమీ, భువనేశ్వర్‌‌, ఖలీల్, నవదీప్‌‌ సైనీ.

టెస్ట్‌‌ జట్టు: కోహ్లీ(కెప్టెన్‌‌), రహానె(వైస్‌‌ కెప్టెన్‌‌), మయాంక్‌‌ అగర్వాల్‌‌, రాహుల్‌‌, పుజార, హనుమ విహారి, రోహిత్‌‌, రిషబ్‌‌ (కీపర్‌‌), సాహా (కీపర్‌‌), అశ్విన్‌‌, జడేజా, కుల్దీప్‌‌, ఇషాంత్‌‌, షమీ,బుమ్రా, ఉమేశ్‌‌. టైటాన్స్​ మళ్లీ ఢమాల్‌.