ధోనీ ఆరో స్థానంలో ఆడాలి: డివిలియర్స్‌‌

ధోనీ ఆరో స్థానంలో ఆడాలి: డివిలియర్స్‌‌

న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ మాజీ కెప్టెన్‌‌ ఎంఎస్‌‌ ధోనీ.. ఆరో ప్లేస్‌‌లో బ్యాటింగ్‌‌కు దిగాలని సౌతాఫ్రికా మాజీ బ్యాటర్‌‌ ఏబీ డివిలియర్స్‌‌ అభిప్రాయపడ్డాడు. 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్‌‌ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, దానికంటే ఆట నుంచి తప్పుకోవడం మంచిదని సూచించాడు.

‘బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌లో చాలా కింద స్థానాల్లో బ్యాటింగ్‌‌ చేసే ధోరణిని మహీ మార్చుకోవాలి. కాకపోతే ఇది చాలా క్లిష్టమైన సమస్య. ఒక ప్లేయర్‌‌ తన బ్రాండ్‌‌ను కొన్నేళ్లుగా శ్రమించి నిర్మించుకుంటాడు. ఎప్పట్నించో సీఎస్‌‌కేకు ఆడుతున్న ధోనీ ఇప్పుడున్న సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. సీఎస్‌‌కే అనే పేరు చెప్పగానే ధోనీ పేరు గుర్తుకు వస్తుంది. ఆ బ్రాండ్‌‌ను వీలైనంత బలంగా ఉంచడం కోసమే ధోనీ పాటుపడుతున్నాడు. కాబట్టి దాన్ని కొనసాగించాలనుకుంటే ఆరో నంబర్‌‌లోనే బ్యాటింగ్‌‌కు రావాలి’ అని డివిలియర్స్‌‌ పేర్కొన్నాడు.

బ్యాట్‌‌తో మహీ ఎంత ప్రభావం చూపిస్తాడో అందరికీ తెలుసన్నాడు. లోయర్‌‌ ఆర్డర్‌‌లో బ్యాటింగ్‌‌ చేస్తూ, కెప్టెన్సీ చేయకపోతే తప్పుడు కారణాలతోనే జట్టులో స్థానాన్ని భర్తీ చేస్తున్న సంకేతాలు వస్తాయన్నాడు. ‘కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడానికి శాంసన్‌‌ సరైన వ్యక్తి. అలాగే సరైన వ్యక్తి వచ్చే వరకు వేచి చూసిన ధోనీకి కూడా ఈ ఘనత దక్కుతుంది. ఒకవేళ ధోనీ బరిలోకి దిగితే ఒత్తిడి లేకుండా నాలుగైదు స్థానాల్లో బ్యాటింగ్‌‌కు రావాలి. అప్పుడే జట్టుకు, ఫ్రాంచైజీకి న్యాయం జరుగుతుంది’ అని డివిలియర్స్‌‌ వెల్లడించాడు.