
- కాళేశ్వరం నుంచి కావాలనే నీటిని ఎత్తిపోస్తలేరన్న కేటీఆర్
- కరువును రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ఫైర్
- పంట నష్టం లెక్కలపై హరీశ్ రావుకు జూపల్లి కౌంటర్
- బీఆర్ఎస్ హయాంలో పరిహారం ఇచ్చారా?: జీవన్‌రెడ్డి
- పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య కౌంటర్, ఎన్కౌంటర్
వెలుగు, నెట్వర్క్ : కరువుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల మధ్య కొద్దిరోజులుగా డైలాగ్‌వార్ నడుస్తున్నది. కాంగ్రెస్‌వల్లే కరువు వచ్చిందని, పంటలకు సాగునీరు ఇవ్వలేకపోతున్నారని మాజీ మంత్రులు హరీశ్, కేటీఆర్‌సహా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుంటే.. దానికి మంత్రులు కౌంటర్ ఇస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. కరువు పేరుతో హరీశ్‌రావు రాజకీయాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ హయాంలోనే వర్షాకాలం ముగిసిందని, తాము డిసెంబర్లో అధికారంలోకి వచ్చామని, చలికాలంలో వర్షాలు ఎలా పడ్తాయని మంత్రి పొన్నం నిలదీస్తున్నారు. ఎల్‌నినో కారణంగా మార్చిలోనే ఎండలు మండుతుండటంతో ప్రాజెక్టులన్నీ అడుగంటిన విషయం హరీశ్‌కు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేడిగడ్డకు రిపేర్లు చేసి కాళేశ్వరం నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారన్న కేటీఆర్ మాటలపైనా కొద్దిరోజుల కింద మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్హయాంలోనే మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని, బ్యారేజీని కాపాడుకునేందుకు నీళ్లన్నీ కిందికి విడిచిపెట్టింది మీరు కాదా? అని కేటీఆర్‌ను నిలదీశారు. తాజాగా, 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ఒక్కో ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వాలన్న హరీశ్‌రావు మాటలపై మంత్రి జూపల్లి మండిపడ్డారు. పంట నష్టం ఎంత జరిగిందో చెప్పాల్సింది అగ్రికల్చర్ ఆఫీసర్లు తప్ప హరీశ్‌రావు కాదని చురకలంటించారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జూపల్లి ప్రకటించారు. అసలు బీఆర్ఎస్ హయాంలో ఏనాడూ పంట నష్ట పరిహారం ఇచ్చిన పాపాన పోలేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ లీడర్లు, కౌంటర్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ లీడర్లు పోటీపడ్తున్నరు.
కరువు పేరుతో ప్రజల్లోకి బీఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలు రెండు, మూడు నెలలపాటు సైలెంట్‌గా ఉండిపోయారు. ఈ లోగా పార్లమెంట్ఎన్నికల షెడ్యూల్ రావడం, క్యాడర్ చేజారుతుండటం, బీఆర్ఎస్ మూడోస్థానానికి పరిమితం కానుందని సర్వేలు చెప్తుండటంతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు రంగంలోకి దిగారు. ఎలాగైనా ప్రజల్లోకి వెళ్లాలని భావించిన వారిద్దరికీ కరువు పరిస్థితులు ఆశాకిరణంగా కనిపించాయి. ఈ క్రమంలో ఈ నెల 7న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పంట పొలాల్లో పర్యటించిన కేటీఆర్.. మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేసి కాళేశ్వరం నీళ్లిచ్చే చాన్స్ ఉన్నా కేవలం తమను రాజకీయంగా దెబ్బతీయాలన్న కక్షతోనే కాంగ్రెస్ ఇవ్వడం లేదని ఆరోపించారు. దీనిపై మరుసటి రోజే పొన్నం కౌంటర్ ఇచ్చారు.
మేడిగడ్డ పిల్లర్లు బీఆర్ఎస్హయాంలోనే కుంగాయని, మిగిలిన పిల్లర్లను కాపాడేందుకు నీళ్లన్నీ కిందికి విడిచిపెట్టింది మీరే కదా? అని నిలదీశారు. ఫోన్‌ట్యాపింగ్‌ల మీద పెట్టిన శ్రద్ధ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణపై పెడితే రైతులకు ఈ కష్టాలు ఉండేవి కాదని తాజాగా మంత్రి జూపల్లి కౌంటర్ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కాళేశ్వరం, ఎస్సారెస్పీ ఆయకట్టు ఎడారిలా మారిందని ఇటీవల మాజీమంత్రి జగదీశ్కూడా సూర్యాపేట జిల్లాలో ఆరోపించడం గమనార్హం.
పంటనష్టం పై హరీశ్ వర్సెస్ జూపల్లి
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని చింత బాయి తండాలో ఈ నెల 24న ఎండిపోయిన వరి పొలా లను పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్‌రావు.. కాంగ్రెస్లక్ష్యంగా విమర్శలు చేశారు. తాజాగా మెదక్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలోనూ అవే వ్యాఖ్యలు రిపీట్ చేశారు. కాంగ్రెస్ సర్కారు సాగునీరు , కరెంట్ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాగా, హరీశ్ కామెంట్స్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్అయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం హరీశ్‌రావు కరువు పరిస్థితులను వాడుకుంటున్నారని, ఎన్ని ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయో చెప్పాల్సింది హరీశ్‌రావు కాదని పేర్కొన్నారు. పంట నష్టంపై ఆఫీసర్లు సర్వే చేస్తున్నారని, ఆ రిపోర్ట్రాగానే పరిహారం అందజేస్తామన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏనాడూ పంట నష్టపరిహారం చెల్లించని హరీశ్‌రావు ఇప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. సాగునీటి సమస్యకు కారణమైన బీఆర్ఎస్ నాయకులే కరువు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. కరెంట్‌పై హరీశ్ వాస్తవాలు తెలుసుకోవాలని, నిరుడు జనవరితో పోలిస్తే 2024 జనవరి లో 10 నుంచి-20 మిలియన్ యూనిట్ల వినియోగం పెరిగిందని ఆయనకు తెలియకపోవడం శోచనీయమని చురకలంటించారు.
బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం ఖాళీ
‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు.. ప్రభుత్వం రాగానే మేడిగడ్డ రిపేర్లు చేసి నీళ్లు ఎత్తి పోసి ఉంటే పంటలకు సాగునీరిచ్చే అవకాశం ఉండే.. కాళేశ్వరంలాంటి ప్రాజెక్టు ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్లు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చింది..’ అని మార్చి 7న కరీంనగర్ కదనభేరీలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇంజినీర్లను సైతం ఆశ్చర్యపరిచాయి. నిజానికి బీఆర్ఎస్ సర్కారు మెయింటెన్స్‌ను గాలికి వదిలేయడం వల్లే మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని నేషనల్ డ్యామ్‌సేఫ్టీ ఆఫీసర్ల టీమ్ స్పష్టం చేసింది. కాళేశ్వరం రిజర్వాయర్లను ఖాళీ చేసింది కూడా బీఆర్ఎస్హయాంలోనేనని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు.