
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కుదిపేసిందో మనందరికీ తెలుసు. లక్షల ప్రాణాలను బలిగొని, కోట్లాది మందిని అనారోగ్యం పాలు చేసిన ఈ వైరస్.మహమ్మారి ముగిసిన తర్వాత కూడా అనేక ఆరోగ్య సమస్యలను సృష్టించింది. గుండెపోటు మరణాలు పెరగడానికి కోవిడ్ ఒక కారణమని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా జరిగిన కొన్ని అధ్యయనాలు మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించాయి. అదే బ్రెయిన్ ఏజింగ్ (మెదడు వృద్ధాప్యం) సమస్య.
కోవిడ్-19 వల్ల మెదడు వృద్ధాప్యం..
కోవిడ్-19 బారిన పడిన వ్యక్తుల మెదడుపై జరిగిన పరిశోధనల్లో వారి మెదడు సాధారణం కంటే వేగంగా వృద్ధాప్యానికి గురవుతోందని తేలింది. ఈ పరిస్థితిని 'బ్రెయిన్ ఏజింగ్' అని పిలుస్తారు. దీని కారణంగా మెదడు పనితీరు మందగించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
మెదడు పరిమాణంలో మార్పులు.. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఒక అధ్యయనంలో కోవిడ్ సోకిన వారి మెదడులో కీలక భాగాలు సంకోచించినట్లు కనుగొన్నారు. ముఖ్యంగా వాసన, రుచిని గుర్తించే ప్రాంతాల్లో మెదడు కణజాలం దెబ్బతిన్నట్లు గుర్తించారు.
జ్ఞాపకశక్తిపై ప్రభావం..న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన మరో పరిశోధనలో కోవిడ్ బారిన పడిన వ్యక్తులలో జ్ఞాపకశక్తి తగ్గినట్లు, ఆలోచనా సామర్థ్యం మందగించినట్లు వెల్లడైంది.
మెదడువాపు (ఇన్‌ఫ్లమేషన్)..కోవిడ్-19 వైరస్ మెదడులో వాపును (Inflammation) కలిగిస్తుంది. ఇది మెదడు కణాలను దెబ్బతీయడం వల్ల బ్రెయిన్ ఏజింగ్ ప్రక్రియ వేగవంతం అవుతుంది.
నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో న్యూరోఇమేజింగ్ నిపుణుడు అలీ-రెజా మొహమ్మది-నెజాద్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధన.. 2006 నుంచి 5లక్షల మంది వాలంటీర్ల మెదడు స్కాన్లు, ఆరోగ్య ఫలితాలను ట్రాక్ చేస్తున్న ఆరోగ్య వనరు అయిన UK బయోబ్యాంక్ నుంచి డేటాను తీసుకున్నారు.
దాదాపు 1000 మంది వ్యక్తుల నుంచి మెదడు స్కాన్‌లను విశ్లేషించిన పరిశోధకులు..సగటు వ్యక్తిలో మెదడు వృద్ధాప్యం వేగంగా పెరుగుతున్నట్లు సంకేతాలు కనిపించాయని ఇది దాదాపు 5.5 నెలల అదనపు వృద్ధాప్యానికి సమానమని కనుగొన్నారు. ఈ మార్పులు పురుషులు ,సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులలో ఎక్కువగా కనిపించాయని అధ్యయనాల్లో తేలింది.
కోవిడ్-19 తర్వాత ఎదురయ్యే సాధారణ సమస్యలు
బ్రెయిన్ ఏజింగ్ సమస్యతో పాటు కోవిడ్-19 తర్వాత చాలా మందిలో కనిపించే ఇతర లక్షణాలు ఇవే..
- తీవ్రమైన అలసట
- నిద్రలేమి
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
- శారీరక బలహీనత
- మానసిక ఆందోళన, డిప్రెషన్
ఈ సమస్యలు దీర్ఘకాలం కొనసాగితే వాటిని లాంగ్ కోవిడ్ (Long Covid) అని పిలుస్తారు. ఈ సమస్యలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. కోవిడ్ బారిన పడిన వారు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నిపుణుల అభిప్రాయం
ఈ అధ్యయనం బలమైన ఆధారాలను అందిస్తున్నప్పటికీ ఈ మార్పులు దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయా లేదా అనేది అస్పష్టంగానే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇప్పటికీ ఒక పరికల్పన అని ఈ అధ్యయనంలో పాల్గొనని కొలంబియా విశ్వవిద్యాలయంలోని న్యూరోసైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఆడమ్ బ్రిక్‌మాన్ అన్నారు.
అయినప్పటికీ బ్రిక్‌మ్యాన్ ,ఇతరులు తమ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చురుకైన చర్యలు చేపట్ట వచ్చని అంగీకరిస్తున్నారు. క్రమం తప్పకుండా శారీరక శ్రమ, తగినంత నిద్ర, సామాజిక సమావేశాలు,ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం వంటి అలవాట్లు ఆరోగ్యకరమైన మెదడు వృద్ధాప్యానికి గురికాకుండా మద్దతు ఇస్తాయని తేలింది.సరైన రక్తపోటు మన మెదడు వృద్ధాప్యాన్ని నెమ్మదిగా చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.