పాకిస్థాన్‌తో ఇలాగే వ్యవహరిస్తారా?.. ఇకపై ఇలాంటివి చెల్లవు

పాకిస్థాన్‌తో ఇలాగే వ్యవహరిస్తారా?.. ఇకపై ఇలాంటివి చెల్లవు

లాహోర్: పాకిస్థాన్ టూర్ నుంచి న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ అర్ధంతరంగా వైదొలగడం సంచలనంగా మారింది. కివీస్ బాటలోనే నడవాలని నిర్ణయించిన ఇంగ్లండ్ బోర్డు.. తమ పురుషుల, మహిళల జట్లు వెళ్లా్ల్సిన పాక్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతోపాటు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)లు వివరణ ఇచ్చుకున్నాయి.  అయినా ఈ వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. న్యూజిలాండ్, ఇంగ్లండ్ బోర్డులు తమతో వ్యవహరించిన తీరు సరికాదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా మండిపడ్డారు. ప్రపంచంలో బెస్ట్ టీమ్‌గా మారడానికి పాక్‌కు ఇదే సరైన సమయమని, అప్పుడే ఇతర జట్లు ఎలాంటి సాకులు చెప్పకుండా తమతో ఆడతాయన్నారు. 

‘పాకిస్థాన్ పర్యటనను ఇంగ్లండ్ రద్దు చేసుకోవడం మమ్మల్ని తీవ్రంగా నిరుత్సాహపర్చింది. కానీ ఇది మేం ఊహించిన విధంగానే ఉంది. వెస్ట్రన్ బ్లాక్ (ఇంగ్లండ్, న్యూజిలాండ్) దేశాలు అనూహ్యంగా కలసిపోయి, ఒకదాన్ని మరొకటి సమర్థించుకుంటున్నాయి. సెక్యూరిటీ కారణాలు  సాకుగా చూపి టూర్‌ రద్దు చేసుకోవడం సరికాదు. తమకు ఎదురైన భద్రతా సమస్యల గురించి మాతో చర్చించకుండానే న్యూజిలాండ్ పాక్ నుంచి వెళ్లిపోవడం మమ్మల్ని ఆగ్రహానికి గురి చేసింది. ఇప్పుడు ఇంగ్లండ్ కూడా అలాగే చేసింది. ఇది మాకో గుణపాఠం. ఇలాంటి జట్లు మా దేశానికి పర్యటనకు వచ్చినప్పుడు వారికి అన్ని వసతలు, విలాసాలు కల్పిస్తాం. కానీ మేం ఆ దేశాలకు వెళ్లినప్పుడు మాత్రం మాపై కఠినమైన క్వారంటైన్ నిబంధనల్ని రుద్దుతారు. అయినా మేం వాటిని భరించాం. కానీ ఇకపై ఇలాంటివి చెల్లవు. మా ఆసక్తులను బట్టే మేం ఎక్కడికైనా వెళ్తాం’ అని రమీజ్ రాజా పేర్కొన్నారు.