ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా అస్తమయం

ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా అస్తమయం

అతను గ్రౌండ్‌‌లోకి వచ్చాడంటే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుడుతుంది. అతనికి బంతి దొరికిందంటే అది గోల్‌‌ పోస్ట్‌‌లో పడిపోతుంది. ఎంతమంది ఉన్నా ఫుట్‌‌బాల్‌‌ మైదానంలో అతని పరుగు ఆపడం అసాధ్యమయ్యేది.  మైదానంలో పాదరసంలా కదులుతూ..  కాళ్లతో మాయ చేస్తూ..  ఎన్ని వివాదాలు చుట్టు ముట్టినా తన ఆటతో ఒక తరాన్ని ఉర్రూతలూగించిన సాకర్‌‌ మాంత్రికుడు డీగో మారడోనా ఇకలేడు.  ఆటగాడిగా, కెప్టెన్‌‌గా, కోచ్‌‌గా, మేనేజర్‌‌గా ఫుట్​బాల్‌‌కు సేవ చేసిన అర్జెంటీనా దిగ్గజం అభిమానులను శోక సంద్రంలో ముంచేసి ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.

బ్యూనోస్‌‌ ఎయిర్స్‌‌:  సాకర్‌‌ సామ్రాజ్యంలో ఒక శకం ముగిసింది. ఇంటర్నేషనల్‌‌ ఫుట్‌‌బాల్‌‌లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడిగా వెలుగొందిన అర్జెంటీనా లెజెండ్‌‌ డీగో మారడోనా తుదిశ్వాస విడిచాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 60 ఏళ్ల డీగో  గుండెపోటుతో బుధవారం  కన్నుమూశాడు.  మారడోనా బ్రెయిన్‌‌లో రక్తం గడ్డకట్టడంతో ఇటీవల సర్జరీ చేశారు. అనంతరం హాస్పిటల్‌‌ నుంచి డిశ్చార్జ్‌‌ చేశారు. ఇంతలో కార్డియాక్‌‌ అరెస్ట్‌‌ కావడంతో డీగో మృతి చెందాడు. 1977 నుంచి 1994 వరకు అర్జెంటీనా నేషనల్‌‌ టీమ్‌‌ తరఫున 91 మ్యాచ్‌‌లు ఆడిన మారడోనా  34 గోల్స్‌‌ చేశాడు.   బార్సిలోనా, నపోలి, సెవిలా, అర్జెంటినోస్‌‌ జూనియర్స్‌‌, బొకా జూనియర్స్‌‌, నెవెల్స్‌‌ ఓల్డ్‌‌ బాయ్స్‌‌ క్లబ్స్‌‌కు కూడా  ప్రాతినిధ్యం వహించాడు. . 1986లో వరల్డ్‌‌ కప్‌‌ విజేతగా నిలిచిన అర్జెంటీనా టీమ్‌‌కు మారడోనానే కెప్టెన్‌‌.  ఆటకు రిటైర్మెంట్‌‌ ఇచ్చాక అర్జెంటీనా నేషనల్‌‌ టీమ్‌‌ సహా పలు జట్లకు మేనేజర్‌‌గా పని చేసిన డీగో కుర్రాళ్లను తీర్చిదిద్దాడు.

ఫుట్‌‌బాల్‌‌ ‘గోల్డెన్‌‌ బాయ్‌‌’

బ్రెజిల్‌‌ లెజెండ్‌‌ పీలే తర్వాత  వరల్డ్‌‌ బెస్ట్‌‌ ఫుట్‌‌బాలర్‌‌గా పేరు తెచ్చుకున్న డీగో అర్మాండో మారడోనా తన  కెరీర్‌‌ అసాంతం ఫ్యాన్స్‌‌ను ఉర్రూతలూగించాడు. ఐదున్నర అడుగుల ఎత్తుండే అతను.. మైదానంలో పాదరసంలా కదులుతుండే వాడు. అతని విజన్‌‌, పాసింగ్‌‌, బాల్‌‌ కంట్రోల్‌‌, డ్రిబ్లింగ్‌‌ స్కిల్స్‌‌ అమోఘం. ప్రత్యర్థి ప్లేయర్లు చుట్టుముట్టినా బంతిని ఒక కాలు నుంచి మరో కాలుకు మారుస్తూ గోల్‌‌ కొట్టి ఆశ్చర్యపరిచేవాడు. ఎడమ కాలుతో అతను షాట్‌‌ కొడితే తిరుగుండేది కాదు. అటాకింగ్‌‌ మిడ్‌‌ఫీల్డర్‌‌ గానే కాకుండా కెప్టెన్‌‌గా కూడా సూపర్‌‌ సక్సెస్‌‌ అయ్యాడు. గ్రౌండ్‌‌లో తన ప్రెజెన్స్‌‌తోనే జట్టులో కొండంత ధైర్యం నింపే మారడోనా.. అంతుచిక్కని వ్యూహాలతో ప్రత్యర్థి ఆటగాళ్లకు సవాల్‌‌ విసిరే వాడు. వీటికితోడు ఫ్రీ కిక్‌‌ స్పెషలిస్ట్‌‌ కావడంతో అతనికి ‘ది గోల్డెన్‌‌ బాయ్‌‌’  బిరుదొచ్చింది.  అర్జెంటీనా నేషనల్‌‌ టీమ్‌‌ తరఫున డీగో అద్భుత పెర్ఫామెన్స్‌‌ చేశాడు. ఎన్నో మ్యాచ్‌‌ల్లో  సింగిల్‌‌ హ్యాండ్‌‌తో జట్టును గెలిపించాడు. నాలుగు వరల్డ్‌‌ కప్‌‌లు ఆడిన అతను 1986 ఫిఫా వరల్డ్‌‌కప్‌‌లో  కెప్టెన్‌‌గా అర్జెంటీనాకు ట్రోఫీ అందించాడు. ఆపై  1990 వరల్డ్‌‌కప్‌‌లో జట్టును ఫైనల్‌‌ తీసుకెళ్లాడు. నాటి తుదిపోరులో జర్మనీ చేతిలో ఓటమి తర్వాత అతని కంట కన్నీళ్లు చూసి అభిమానులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. పదో నెంబర్‌‌ జెర్సీ వాడే డీగో క్లబ్స్‌‌ తరఫున కూడా చెలరేగేవాడు.

 

సాకర్‌‌ హిస్టరీలోనే రెండుసార్లు వరల్డ్‌‌ రికార్డు ట్రాన్స్‌‌ఫర్‌‌ ఫీ అందుకున్న తొలి ప్లేయర్‌‌గా నిలిచాడు. మారడోనా అనగానే ఫుట్‌‌బాల్‌‌ ఫీల్డ్‌‌లో అతని మాయాజాలమే కాదు, ఎన్నో వివాదాలు కూడా కనిపిస్తాయి. కెరీర్‌‌ చివరి దశలో డ్రగ్స్‌‌కు బానిసయ్యాడు.1991లో అతనిపై 15 నెలల నిషేధం పడింది. కానీ, పోరాటస్పూర్తికి మారుపేరైన డీగో అందరినీ ఆశ్చర్యపరుస్తూ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే,  మునుపటిలా ఆడలేక  37 ఏళ్ల వయసులో  1997లో రిటైర్మెంట్‌‌ ప్రకటించాడు. డ్రగ్స్‌‌ వాడకం అతని ఆరోగ్యంపై ప్రభావం చూపింది. 2000 సంవత్సరంలో ఆసుపత్రిలో చేరి చావు అంచులదాకా వెళ్లొచ్చాడు. కోలుకున్నప్పటికీ మెంటల్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వెంటాడాయి. అయితే, 2008లో అర్జెంటీనా కోచ్‌‌గా నేషనల్‌‌ టీమ్‌‌లో రీఎంట్రీ ఇచ్చి అందరినీ విస్మయపరిచాడు.  2001లో ఫిఫా.. సాకర్‌‌ హిస్టరీలో ఇద్దరు గ్రేటెస్ట్‌‌ ప్లేయర్లుగా పీలేతో మారడోనాను ఎంపిక చేసింది.  బ్యూనోస్‌‌ ఎయిర్స్‌‌ శివారుల్లో ఓ పేద కుటుంబంలో ఐదో సంతానం అయిన  డీగో..  అంచెలంచెలుగా ఎదిగి సాకర్‌‌ సామ్రాజ్యాన్ని ఏలిన గోల్డెన్‌‌ బాయ్‌‌గా ఎప్పటికీ గుర్తుండిపోతాడు.