ఖమ్మం ఆర్టీసీ డిపోల్లో డీజిల్ లేక అవస్థలు

ఖమ్మం ఆర్టీసీ డిపోల్లో డీజిల్ లేక అవస్థలు

ఖమ్మంలో ఆర్టీసీ సిబ్బందిని డీజిల్ కష్టాలు వెంటాడుతున్నాయి. డిపోల్లోని బంకుల్లో డీజిల్ లేకపోవడంతో ఆర్టీసీ బస్సులన్నీ నడిరోడ్డుపై పడిగాపులు కాస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 600 బస్సులు ఉండగా.. ఒక్కో దానికి రోజుకు సగటున 100 లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. ఈ లెక్కన దాదాపు 50వేల లీటర్ల డిమాండ్ ఉండగా.. ట్యాంకర్ రాకపోవడంతో సమస్య మొదలైంది. డిపోల్లో డీజిల్ లేకపోవడంతో బస్సులన్నీ ప్రైవేటు బంకుల బాటపట్టాయి. దీంతో బైపాస్ రోడ్డులో దాదాపు 100 బస్సుల వరకు బారులు తీరాయి. సమస్యను యాజమాన్యం పట్టించుకోకపోవడంతో డీజిల్ కోసం రెండు మూడు గంటలపాటు నిరీక్షించాల్సి వస్తోందని డ్రైవర్లు చెబుతున్నారు. గత రెండురోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.