వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ లో గందరగోళం

వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ లో గందరగోళం
  • డివిజన్లలో ఎవరికివారే కార్యక్రమాల నిర్వహణ
  • ఒకరిపై ఒకరు పరోక్ష విమర్శలు, ఆరోపణలు

హనుమకొండ, కాజీపేట, వెలుగు: ఓరుగల్లు కాంగ్రెస్ లో విభేదాలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. సమయం వచ్చినప్పుడల్లా వర్గపోరు, కుమ్ములాటలతో రచ్చకక్కే కాంగ్రెస్ లీడర్లు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యే టికెట్ నాదంటే నాదేనంటూ ఎవరికివారు ప్రకటనలు చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఇదే ఏడాది ఎన్నికలు జరగనుండగా.. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ కనీస ప్రభావం చూపే అవకాశాలు తక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వెస్ట్ టికెట్​ నాదంటే నాదే..

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం జనరల్​కు రిజర్వ్​ కాగా.. కాంగ్రెస్​ తరఫున పోటీ చేసేందుకు హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్​ రెడ్డి, జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్నారు. నాయిని ఇదివరకు రెండు సార్లు టికెట్​ ఆశించి భంగపడగా.. ఈసారి ఎలాగైనా టికెట్​ తనకేననే భావనలో ఉన్నారు. కానీ జంగా రాఘవరెడ్డి కూడా ఇదే తీరుగా టికెట్​ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎప్పటినుంచో వర్గపోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే జంగా, నాయిని వర్గాల నాయకులు బాహాబాహీకి దిగిన సందర్భాలు ఉన్నాయి. కాగా కాంగ్రెస్​ ఇటీవల చేపట్టిన హాత్​ సే హాత్​ జోడో యాత్ర సందర్భంగా మరోసారి ఇరువురి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఒకే నియోజకవర్గంలో ఇద్దరూ వేర్వేరుగా పాదయాత్రలు చేయడం, టికెట్​ తమదేనంటూ చెప్పుకుంటుండటంతో విభేదాలు బయటపడటమే కాకుండా క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది. 

పరస్పర విమర్శలు, ఆరోపణలు

జంగా, నాయిని మధ్య తరచూ విభేదాలు బయటపడుతుండగా.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖ, కొండా మురళి దంపతులు తమ పని తాము చేసుకు పోతుండగా..  వెస్ట్​లో మాత్రం ఇద్దరు నాయకుల తీరుతో గందరగోళం ఏర్పడింది. దీంతో పార్టీ కార్యకర్తలు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు. 

రేపోమాపో  సస్పెండే: నాయిని రాజేందర్​ రెడ్డి

హాత్​ సే హాత్​ జోడో పాదయాత్ర సందర్భంగా సోమవారం కాజీపేటలోని 47వ డివిజన్​లో పర్యటించిన నాయిని రాజేందర్​ రెడ్డి హాట్​ కామెంట్స్​ చేశారు. పక్కజిల్లా నుంచి వచ్చిన కొందరు నాయకులు స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో కుమ్మక్కై ఇక్కడి కార్యకర్తలను కార్యక్రమాలకు రాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారిని రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయమని అన్నారు. 

నాయిని స్థానికుడు కాదు..  టికెట్ నాదే: జంగా

కాజీపేట, వెలుగు: వరంగల్​ పశ్చిమ టికెట్ ఈసారి తనదేనని జనగామ డీసీసీ ప్రెసిడెంట్​ స్పష్టం చేశారు. హాత్​ సే హాత్​ జోడో కార్యక్రమంలో భాగంగా మంగళవారం 63వ డివిజన్​లో పర్యటించారు.  తాను కాంగ్రెస్​ వాదినని, 30 ఏండ్లుగా పార్టీ జెండాను మోస్తున్నానన్నారు. 'నేను ఈ ప్రాంత వాసిని. ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసు. చావులు, బతుకులకు తిరిగేవాడిని నేను. ఈ ప్రాంత వాసిని కాబట్టే వరంగల్ పశ్చిమ టికెట్​ కోసం కొట్లాడుతున్న. నాయిని స్థానికుడు కాదు. అన్నదమ్ముల్లెక్కనే పార్టీలో కూడా వర్గాలున్నాయి. మాదంతా అన్నదమ్ముల పోరాటమే' అని చెప్పుకొచ్చారు. తాను పశ్చిమలో నిలబడితే నాయిని రాజేందర్​ రెడ్డి తన గెలుపు కోసం పని చేస్తాడని, అవసరమైతే రెండు, మూడు కోట్లయినా ఖర్చు పెడతాడని అన్నారు. అందరం కలిసి బీజేపీ, బీఆర్​ఎస్​ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట కార్పొరేటర్లు జక్కుల రవీందర్​ యాదవ్​, విజయశ్రీ, స్థానిక కాంగ్రెస్​ నేతలు ఉన్నారు.