ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు.. ఈనెల 11న వెలువడే అవకాశం

ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు.. ఈనెల 11న వెలువడే అవకాశం

హైదరాబాద్, వెలుగు :  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సెంట్రల్​ఎలక్షన్ ​కమిషన్​ ట్విస్ట్​ ఇచ్చింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్​లు ఇస్తామని షెడ్యూల్​లో పేర్కొన్నది. నిజంగా అదే జరిగితే రెండు సీట్లు కాంగ్రెస్​ ఖాతాలోకి చేరనున్నాయి. తెలంగాణలో రెండు, ఉత్తరప్రదేశ్​లో ఒక ఎమ్మెల్సీ స్థానం ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్నాయని, వాటికి ఈనెల11న వేర్వేరుగా నోటిఫికేషన్​లు జారీ చేస్తామని సీఈసీ అండర్​సెక్రటరీ ప్రఫుల్​అవస్తీ గురువారం షెడ్యూల్​ప్రకటించారు. తెలంగాణ నుంచి ఖాళీ అయిన రెండు సీట్ల పదవీకాలం 2027 నవంబర్​30వ తేదీతో ముగియనుంది. యూపీ నుంచి ఖాళీ అయిన స్థానం పదవీకాలం 2027 జనవరి 30వ తేదీ వరకు ఉంది.

సీఈసీ ఎమ్మెల్సీ షెడ్యూల్​ ప్రకటించిన కొన్ని గంటల్లోనే తెలంగాణ సీఈవో వికాస్​రాజ్​ఈ ఎన్నికలపై ప్రెస్​రిలీజ్​ఇచ్చారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సీఈసీ ప్రకటించిన షెడ్యూల్​ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సీఈసీ ఇచ్చిన షెడ్యూల్​లో తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలు, యూపీలోని ఒక సీటుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇస్తామని వెల్లడించారు. ఈ లెక్కన ఈనెల11న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరు ఎన్నికల నోటిఫికేషన్​ఇస్తారని తెలుస్తోంది. అయితే ఈ రెండు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగి.. పదవీకాలం కూడా ఒకేసారి ముగియనుంది. ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్​ఇస్తే తప్ప ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ షెడ్యూల్​లో పేర్కొన్నట్టుగానే వేర్వేరుగా రెండు నోటిఫికేషన్​లు ఇస్తే అసెంబ్లీలో సంఖ్యాబలం రీత్యా రెండు స్థానాల్లో కాంగ్రెస్​అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. ఒకవేళ రెండు సీట్ల భర్తీకి ఒకే నోటిఫికేషన్​జారీ చేస్తే మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్​లకు తలా ఒక స్థానం దక్కుతాయి.