రిలయన్స్‌‌తో మ్యూచువల్​ ఫండ్స్​కు ఇబ్బందులు

రిలయన్స్‌‌తో మ్యూచువల్​ ఫండ్స్​కు ఇబ్బందులు

ఇండెక్స్ పెరుగుతున్న కంపెనీ వెయిటేజి
వాటా పెం చుకోలేకపోతున్న ఎంఎఫ్‌ లు

ముంబై: గత కొన్ని నెలల నుంచి దూసుకుపోతున్న  రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ షేరు, ఈక్విటీ  మ్యూచువల్‌‌ఫండ్స్‌‌కు కొత్త తలనొప్పి తెచ్చింది.  కరోనా దెబ్బతో ఈ ఏడాది మార్చిలో భారీగా పడ్డ రిలయన్స్‌‌, ప్రస్తుతం ఆ స్థాయి నుంచి రెండింతలకు  పైగా పెరిగింది. కంపెనీలోకి ఇన్వెస్ట్‌‌మెంట్లు వస్తుండడంతో ఇంకా ర్యాలీ చేస్తోంది. దీంతో  ఎస్‌‌ అండ్‌‌ పీ బీఎస్‌‌ఈ సెన్సెక్స్‌‌లో  రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ వెయిటేజి భారీగా పెరిగింది. గతేడాది నవంబర్‌‌‌‌లో సెన్సెక్స్‌‌లో 11 శాతంగా ఉన్న కంపెనీ వెయిటేజి, ప్రస్తుతం 17.4 శాతానికి చేరుకుంది. కాగా, సెబీ రూల్స్‌‌ ప్రకారం ఏ ఫండ్‌‌ హౌస్‌‌ అయినా ఒకే కంపెనీలో10 శాతం కంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేయకూడదు.  దీంతో  రిలయన్స్‌‌ షేరు పెరుగుతున్నా  ఈ లిమిట్‌‌కు మించి ఫండ్‌‌ మేనేజర్లు కొనలేకపోతున్నారు.  ఇండెక్స్‌‌లో ఏ కంపెనీ వెయిటేజైనా పెరిగితే ఆ స్టాక్‌‌లో ఫండ్‌‌ హౌస్‌‌ హోల్డింగ్‌‌ కెపాసిటీని కూడా పెంచాలని ఫండ్‌‌ మేనేజర్లు సెబీని కోరుతున్నారు. మార్కెట్‌‌లో ఎక్కువ వెయిటేజి ఉన్న స్టాక్‌‌ను కొనుగోలు చేయలేకపోతే  ఇండెక్స్‌‌ను మేనేజ్‌‌ చేయడం ఫండ్‌‌ మేనేజర్లకు కష్టంగా మారుతుంది.  ఈ విషయాలు క్లయింట్స్‌‌కు అర్థం కావని, ఒక ఫండ్‌‌ ఎందుకు అండర్‌‌‌‌ పెర్ఫార్మెన్స్‌‌ చేస్తుందో వివరించడం కష్టమని కోటక్‌‌ అసెట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ ఎండీ నీలేశ్‌‌ షా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులలో  ప్రాఫిట్స్‌‌ బుకింగ్‌‌ చేయడానికే  ఫండ్స్‌‌ మొగ్గుచూపుతాయని అన్నారు.

సొంత ఇన్వెస్ట్‌‌మెంట్లకు సై

గత కొన్ని నెలల నుంచి చూస్తే ఇండియాలో  ఈక్విటీ ఫండ్స్‌‌కు పాపులారిటీ తగ్గుతోంది. ఇన్వెస్టర్లు సొంతంగా మార్కెట్లో ఇన్వెస్ట్‌‌ చేసుకుంటున్నారు. కరోనా దెబ్బతో భారీగా పడ్డ  లార్జ్‌‌ క్యాప్‌‌ ఫండ్స్‌‌ తిరిగి పుంజుకున్నాయి. గత ఆరు నెలల్లో ఈ ఫండ్స్‌‌ సగటున 8 శాతం పెరిగాయి. ఇదే కాలంలో సెన్సెక్స్‌‌ 9 శాతం లాభపడింది. గతవారం రిలయన్స్ షేరు 12 శాతం పెరిగి 200 బిలియన్‌‌ డాలర్ల మార్కెట్‌‌ క్యాప్‌‌ను దాటింది. కానీ, ఆగస్ట్‌‌ నెలలో ఫండ్‌‌ మేనేజర్లు  తమ రిలయన్స్ హోల్డింగ్‌‌లో 50 లక్షల షేర్లను అమ్మేశారని ఎడెల్వీస్‌‌ ఫైనాన్షియల్‌‌ సర్వీసెస్‌‌ పేర్కొంది. వీటి విలువ సుమారుగా రూ. 1,030 కోట్లుగా ఉంటుందని, వాల్యూ పరంగా ఎక్కువగా అమ్ముడైన స్టాకులో రిలయన్స్‌‌ ముందుందని తెలిపింది.