
కాళోజీ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నారు. బుధవారం కాళోజీ హెల్త్ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీ వీసీ, కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్‌లో ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఆయుష్ డైరెక్టర్ అలుగు వర్షిణి, వర్సిటీ వీసీ, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, డీఎంఈ, రమేశ్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అడ్మిషన్లు, ఎగ్జామినేషన్, వర్సిటీ నిధులు, కేటాయింపులు సహా పలు అంశాలపై చర్చించారు. 9 మెడికల్, ఓ డెంటల్ కాలేజీలో డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటుకు రూ.1.5 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీలోనూ డిజిటల్ బ్లాక్ ఆడిటోరియం నిర్మించాలని నిర్ణయించారు.
కాలేజీల్లో వర్క్‌షాపులు, సెమినార్లకు సీఎంఈ ఫండ్ కోసం రూ.50 లక్షలు కేటాయించనున్నారు. ప్రస్తుతం గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఫిజియో థెరపీ కోర్సులు లేవు. వచ్చే ఏడాది ప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదికివ్వాలని డీఎంఈ రమేశ్‌రెడ్డికి శాంతి కుమారి సూచించారు. నేచురోపతి పీజీ కోర్సులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయుష్ డైరెక్టర్‌కు సూచించారు. మీటింగ్ తర్వాత నిర్మాణంలో ఉన్న వర్సిటీ కొత్త బిల్డింగ్‌ను శాంతికుమారి పరిశీలించారు. నవంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలన్నారు.