షాద్ నగర్, వెలుగు: షాద్నగర్ డీసీపీ కార్యాలయంలో పోలీసు అధికారులకు కేసుల దర్యాప్తుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో గొడవలు లేదా దాడులు జరిగినప్పుడు సాక్ష్యాల సేకరణలో పాటించాల్సిన మెలకువలను వివరించారు.
ముఖ్యంగా ఘటన జరిగిన ప్రాంతం నుంచే డిజిటల్ పద్ధతిలో నేరుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే వినూత్న విధానంపై ఐటీ విభాగం ప్రతినిధులు అధికారులకు అవగాహన కల్పించారు. డిజిటల్ సాక్ష్యాల సేకరణ వల్ల విచారణ వేగవంతమై బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ పరిధిలోని ఎస్‌హెచ్ఓలు, ఎస్సైలు, స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు.
