- నెదర్లాండ్స్ లో ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధాని స్పీచ్
- నెదర్లాండ్స్ లో ఉంటే భారత్‌లో ఉన్నట్టే ఉందని కామెంట్
ది హేగ్: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో నెలకు 20 బిలియన్ డాలర్ల డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. భారత్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్లలాంటి సరికొత్త రంగాల్లోనూ దూసుకుపోతోందన్నారు. నాలుగు యూరోపియన్ దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ చేరుకున్న మోదీ శనివారం ది హేగ్ నగరంలో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. నెదర్లాండ్స్‌లో ఉంటే భారత్‌లో ఉన్నట్టే ఉన్నదన్నారు. ప్రవాస భారతీయులు తనకు అందించిన సాంస్కృతిక స్వాగతాన్ని చూసి, తాను నెదర్లాండ్స్‌లో ఉన్నాననే విషయమే మర్చిపోయానని, దేశంలో ఏదో పండుగ జరుగుతున్నట్టు అనిపించిందని ఆనందం వ్యక్తం చేశారు.
ది హేగ్.. స్నేహానికి సజీవ సాక్ష్యం
భారత్ మాతా కీ జై నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. ది హేగ్ నగరాన్ని ‘శాంతి, న్యాయాల నగరం’ అని పిలుస్తారని, కానీ ఇక్కడి వాతావరణం చూస్తుంటే ఇది ‘భారతీయ స్నేహానికి సజీవ చిహ్నం’లాగా మారిపోయిందని అన్నారు. పాస్‌పోర్ట్ రంగు, చిరునామా, టైమ్ జోన్ మారినా.. భరతమాత బిడ్డల గుండెల్లో ఉండే ఉత్సాహం, జీవన శైలి ఎప్పటికీ మారవని మోదీ కొనియాడారు.
ఆటల్లోనూ అనుబంధం..
నెదర్లాండ్స్ ‘తులిప్’ పువ్వులకు ప్రసిద్ధి అయితే, భారత్ ‘తామర’ పువ్వులకు ప్రసిద్ధి అని, ఈ రెండూ అందాన్ని, బలాన్ని సూచిస్తాయని మోదీ పేర్కొన్నారు. డచ్ క్రికెట్ జట్టులో రాణిస్తున్న తేజ నిడమనూరు, విక్రమ్‌జిత్ సింగ్, ఆర్యన్ దత్‌లాంటి భారతీయ సంతతి ఆటగాళ్లను అభినందించారు. భారత మహిళల హాకీ జట్టు రాణించడంలో డచ్ కోచ్ మరిజ్నే కీలక పాత్ర పోషించారని కొనియాడారు. 2036లో జరిగే ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ రెడీగా ఉన్నదని వెల్లడించారు.
మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ నంబర్ 2
దశాబ్దం క్రితం మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకున్న భారత్, నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా ఎదిగిందని మోదీ గుర్తుచేశారు. భారత్‌లో నిర్మిస్తున్న సోలార్ పార్కులు ప్రపంచంలోనే అతిపెద్దవని చెప్పారు. భారత్‌లో 90 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారని, 2024 లోక్ సభ ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటు వేశారని వివరించారు. ఈయూ దేశాల జనాభా మొత్తం కలిపినా 64 కోట్ల మంది కూడా లేరని అన్నారు. భారత్‌లో ఒకప్పుడు 4 యూనికార్న్ స్టార్టప్‌లే (దాదాపు ₹8,300 కోట్లకు పైగా మార్కెట్ విలువ ఉండే కంపెనీలు) ఉండేవని, కానీ ఇప్పుడు అవి125కు చేరుకున్నాయన్నారు. దేశంలో ప్రస్తుతం12 సెమీకండక్టర్ ప్లాంట్ల పనులు వేగంగా సాగుతున్నాయని, వాటిలో రెండు ప్లాంట్లలో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైందని మోదీ వెల్లడించారు.
