
లక్నో సూపర్ జెయింట్స్ మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ రాత్గు తన విచిత్ర ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025లో అద్భుతమైన బౌలర్ గా పేరు తెచ్చుకున్నా విచిత్ర ఆటిట్యూడ్ తో పలుమార్లు జరిమానాకు గురయ్యాడు. ప్రత్యర్థికి జట్లపై వికెట్ తీసిన ప్రతిసారి నోట్ బుక్ సెలెబ్రేషన్ చేసుకుంటూ పలుమార్లు నిషేధానికి గురయ్యాడు. అంతేకాదు ఐపీఎల్ 2025లో ఈ లెగ్ స్పిన్నర్ తన ఓవరాక్షన్ తో ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఇదంతా పక్కనపెడితే మరోసారి దిగ్వేశ్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ తన ఆటిట్యూడ్ తో చర్చనీయాంశంగా మారాడు.
స్టార్ బ్యాటర్ నితీష్ రాణాతో మాటల వాగ్వాదానికి దిగినందుకు, దిగ్వేష్‌కు అతని మ్యాచ్ ఫీజులో 80 శాతం భారీ జరిమానా విధించబడింది. అదే సమయంలో రాణా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించబడింది. "ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆర్టికల్ 2.2 (లెవల్ 2) కింద ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దిగ్వేష్ రతికి మ్యాచ్ ఫీజులో 80% జరిమానా విధించబడింది.
ఆర్టికల్ 2.6 (లెవల్ 1) కింద ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు నితీష్ రాణాకు మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించబడింది". అని శుక్రవారం మ్యాచ్ తర్వాత శనివారం (ఆగస్టు 30) మీడియా అడ్వైజరీలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్ తెలిపింది. మ్యాచ్ సమయంలో వీరిద్దరూ అశ్లీలమైన, అభ్యంతరకరమైన సైగలు చేసుకున్నట్టు తేలిందని ఢిల్లీ ప్రీమియర్ లీగ్ చెప్పుకొచ్చింది.
శుక్రవారం (ఆగస్టు 29) ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో భాగంగా వెస్ట్ ఢిల్లీ లయన్స్ కెప్టెన్ నితీష్ రాణా, సౌత్ ఢిల్లీ స్పిన్నర్ దిగ్వేష్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో చెలరేగి ఆడుతున్న నితీష్.. దిగ్వేశ్ బౌలింగ్ లోనూ బౌండరీల వర్షం కురిపించాడు. రాత్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ షాట్ ఆడి సిక్సర్ కొట్టిన తర్వాత రాత్ కోపంగా నితీష్ ను ఏదో అన్నాడు. దిగ్వేశ్ మాటలకు ఫైర్ అయిన నితీష్ బ్యాట్ చూపిస్తూ ఏదో అన్నాడు. మాటా మాటా పెరగడంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. అంపైర్లు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చారు.
ఈ మ్యాచ్ లో నితీష్ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 55 బంతుల్లోనే 15 సిక్సర్లు, 8 ఫోర్లతో 134 పరుగులు చేసి వెస్ట్ లయన్స్ జట్టును సింగిల్ హ్యాండ్ తో గెలిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. అన్మోల్ శర్మ (55), తేజస్వి దహియా (60), సుమిత్ మాథుర్ (48*) రాణించారు. నితీష్ విజృంభణకు లక్ష్య ఛేదనలో వెస్ట్ లయన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Things got 𝐡𝐞𝐚𝐭𝐞𝐝 between Digvesh Rathi and Nitish Rana 👀pic.twitter.com/KqIkB6DYCE
— Cricbuzz (@cricbuzz) August 30, 2025