సినీ రంగం కోసం 'ఫిల్మ్స్ ఇన్ తెలంగాణ' పోర్టల్.. సింగిల్ విండో సిస్టమ్‌తో అనుమతులు!

 సినీ రంగం కోసం 'ఫిల్మ్స్ ఇన్ తెలంగాణ' పోర్టల్..  సింగిల్ విండో సిస్టమ్‌తో అనుమతులు!

సినిమా రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక అడుగు వేశారు. త్వరలో సినిమా షూటింగ్‌లు, థియేటర్ల కార్యకలాపాలు, ఇతర అనుమతుల కోసం ఒకే చోట అన్ని సేవలు అందించేలా ‘ఫిల్మ్స్ ఇన్ తెలంగాణ’ అనే కొత్త వెబ్‌సైట్‌ను తీసుకురానున్నారు. ఈ కొత్త ఆన్‌లైన్ విధానం ద్వారా సినిమా పరిశ్రమకు సంబంధించిన పనులు మరింత సులభతరం కానున్నాయి.

సింగిల్ విండో సిస్టమ్‌తో సులభతరం

ఈ వెబ్‌సైట్ ఏర్పాటుపై  బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఒక ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సినీ పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, సినిమా పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని పరిశ్రమ ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేవలు

ఈ కొత్త వెబ్‌సైట్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సినిమా నిర్మాణానికి కావాల్సిన అన్ని వివరాలను ఒకే చోట అందిస్తుంది. ఒక దర్శకుడు లేదా నిర్మాత కేవలం స్క్రిప్ట్‌తో వస్తే, వారికి కావాల్సిన లొకేషన్లు, ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన అనుమతులు, టెక్నికల్ సర్వీసులు, నిపుణులైన సాంకేతిక నిపుణులు, హైదరాబాద్‌తో పాటు ఇతర తెలంగాణ నగరాల్లో హోటల్ వసతుల సమాచారాన్ని ఈ వెబ్‌సైట్ అందిస్తుందని దిల్ రాజు వివరించారు. ఈ తరహా సౌకర్యం దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అందుబాటులోకి రానుంది.

ఆన్‌లైన్ ద్వారా థియేటర్ల అనుమతులు

ఇప్పటివరకు సినిమా థియేటర్లకు అవసరమైన బీ-ఫారమ్ అనుమతులను నగరాల్లో పోలీస్ కమిషనర్లు, జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లు జారీ చేసేవారు. అయితే, ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుందని దిల్ రాజు తెలిపారు. ఈ విషయంలో హోం శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వెబ్‌సైట్ రూపకల్పనపై సలహాలు, సూచనలు ఇవ్వాలని సినీ పరిశ్రమ ప్రతినిధులను, అధికారులను ఆయన కోరారు. వెబ్‌సైట్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారికంగా లాంచ్ చేస్తారని ఆయన తెలిపారు.