దసరా రోజున గృహ ప్రవేశాలపై డైలమా 

దసరా రోజున గృహ ప్రవేశాలపై డైలమా 

సర్కారు రిజిష్ట్రేషన్లు నిలిపివేయడంతో ఆగిన గృహ ప్రవేశాలు

హైదరాబాద్, వెలుగు : దసరా రోజున ఏ పని మొదలుపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుందనేది సెంటిమెంట్. అందుకే చాలా మంది దసరా నాడు శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకుంటారు. ముఖ్యంగా సొంతింటికి సంబంధించి అన్నీ ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ సారి ఆ పనులన్నింటికీ బ్రేక్  పడింది. సర్కారు రిజిస్ట్రేషన్లను కొన్నాళ్లు నిలిపివేయడంతో పండగనాడు సొంతింట్లోకి అడుగు పెట్టాలనుకునేవారు, ల్యాండ్​ కొని భూమి పూజ చేయాలనుకున్న వాళ్లు డైలమాలో పడ్డారు. ఏడెనిమిది నెలలుగా కరోనా కారణంగా పనులన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్న టైమ్​లోనే సర్కారు రిజిస్ట్రేషన్లను ఆపేసింది. అడ్వాన్స్​ను చెల్లించి ఉన్న వాళ్లు రిజిస్ట్రేషన్లు చేయించుకునే పరిస్థితి లేదు. ప్రతి ఏడాది దసరాకు రెండు నెలల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. రియల్ లావాదేవీలు స్పీడ్​గా జరిగిపోతాయి.

గతేడాదిలో 12 వేల గృహ ప్రవేశాలు

గతేడాది దసరా సందర్భంగా మూడు జిల్లాల పరిధిలో విస్తరించిన గ్రేటర్ లో 12,236  గృహ ప్రవేశాలు జరిగాయని అంచనా. మరో 15 వేలకు పైగా ఓపెన్ ప్లాట్లకు భూమి పూజలు జరిగాయి. మూడు జిల్లాల్లో చిన్నాచితక పనులైన కొత్త  దర్వాజాలు ఎత్తడం, స్లాబ్ పనికి పూజలు, పునాదిరాయి వేయడం వంటిని వేలల్లో జరిగాయి. అయితే ఎక్కువగా దసరా రోజున భూమి పూజలు, గృహప్రవేశాలకు ఇంపార్టెన్స్​ ఇస్తారని పూజారులు చెబుతున్నారు.

రిజిస్ట్రేషన్ బంద్ తో పనులన్నీ వాయిదా

సర్కారు రిజిస్ట్రేషన్స్ నిలిచిపోవడంతో ఇప్పటికే అడ్వాన్సులు, అగ్రిమెంట్లు చేసుకున్నవాళ్లు ఇబ్బందిపడుతుంటే, మరోవైపు బిల్డింగ్స్, ఫ్లాట్లను బిల్డర్స్​సకాలంలో హ్యాండోవర్ చేయలేకపోతున్నారు. ఇక లోన్ ఆధారిత కస్టమర్లకు రిజిస్ట్రేషన్ల బంద్ తో పేమెంట్లు భారంగా మారాయి. ఇప్పటికే డబ్బులు చెల్లించినవారు కూడా  రిజిస్ట్రేషన్ ఆగడంతో సొంతింటికి దూరమవుతున్నారు. దీంతోపాటు ఎల్ఆర్ఎస్ పర్మిషన్స్​ఉన్న ప్లాట్ల  రిజిస్ట్రేషన్ కూడా నిలిపివేయడం సమస్యగా మారింది.

కొనుగోలుదారుల్లో ఆందోళన

నిర్మాణంలో ఉన్న పది ఇండ్లకు అగ్రిమెంట్లు చేసుకుని కొంత మొత్తంలో పేమెంట్ అయింది. ఈ నెలలో రిజిస్ట్రేషన్ పూర్తికావాల్సి ఉండే. ఒక్కసారిగా రిజిస్ట్రేషన్స్​ నిలిచిపోవడం సమస్యగా మారింది. రిజిస్ట్రేషన్ అయితేగానీ మొత్తం డబ్బులు చేతికి రావు. దీంతో బిల్డర్లపై వడ్డీల భారం పడుతోంది. ‑రాంచందర్ రావు, బిల్డర్

దసరా తర్వాత కూడా క్లారిటీ లేదు

దసరా తర్వాత కూడా రిజిస్ట్రేషన్లు మొదలవుతాయనే క్లారిటీ లేదు. పదేళ్లుగా ఓపెన్ ప్లాట్ల బిజినెస్​ చేస్తున్న.  కరోనా కొంచెం దెబ్బతీస్తే.. ప్రభుత్వ నిర్ణయం మరో దెబ్బ తీసింది. దసరా తర్వాత ల్యాండ్ మార్కెట్ విలువ పెరుగుతుందని చెబుతుండటంతో డెవలపర్లకు, కొనుగోలుదారుల మధ్య కొత్త సమస్యలొస్తాయి. చాలావరకు కొనుగోలుదారుడిపైనే భారం పడుతుంది. ‑ గౌరీ శంకర్, డెవలపర్

దసరాకు చాలా కార్యాలుండేవి

దసరాకు చాలా మంది గృహ ప్రవేశాలు పెట్టుకునేవాళ్లు. ఈ ఏడాది కరోనాతో ఆరేడు నెలలుగా అలాంటి పరిస్థితి లేదు. ఈ దసరాకు కూడా గృహ ప్రవేశాలు, భూమి పూజలు పెద్దగా లేవు. చాలా మంది దీపావళి తర్వాత మంచి రోజు గురించి అడుగుతున్నారు. గతేడాది  సిటీలో దసరా నాడునాలుగు గృహ ప్రవేశాలకు అటెండ్​ అయ్యా. ‑ సతీశ్​, అర్చకులు.