బెంగాల్ మంత్రులకు శాఖల కేటాయింపు.. దిలీప్ ఘోష్‎కు గ్రామీణాభివృద్ధి శాఖ

బెంగాల్ మంత్రులకు శాఖల కేటాయింపు.. దిలీప్ ఘోష్‎కు గ్రామీణాభివృద్ధి శాఖ

కోల్‎కతా: కొత్తగా ఎన్నికైన మంత్రులకు బెంగాల్ ప్రభుత్వం శాఖలు కేటాయించింది. సోమవారం (మే 11) తన కేబినెట్‎లోని ఐదుగురు మంత్రులకు సీఎం సువేందు అధికారి పోర్టుఫోలియోలు అలాట్ చేశారు. బెంగాల్ బీజేపీ మాజీ చీఫ్ దిలీప్ ఘోష్‌కు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అప్పగించారు. మాజీ కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్‎కు ఉత్తర బెంగాల్ అభివృద్ధి, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ బాధ్యతలు కేటాయించారు. 

బీజేపీ కీలక మహిళా నాయకురాలు అగ్నిమిత్ర పాల్‎కు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖలను అప్పగించారు. ఖుదీరామ్ టుడు గిరిజన అభివృద్ధి శాఖను పర్యవేక్షించనుండగా.. అశోక్ కీర్తానియా ఆహార శాఖ మంత్రిగా నియమితులయ్యారు. వివిధ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మంత్రులకు శాఖలు కేటాయించారు. 

బెంగాల్ లో భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. సీఎంగా సువేందు అధికారితోపాటు ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం (మే9) ఉదయం11 గంటలకు బెంగాల్ కు తొలి బీజేపీ సీఎంగా సువేందు  అధికారి, మరో ఐదుగురు మంత్రులతో గవర్నర్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు.  సువేందు అధికారి కేబినెట్ లో దీలిప్ ఘోష్, అగ్ని మల్హోత్రా,నిశిత్ ప్రమాణిక్, క్షుదిరామ్  టుడు,అశోక్  కీర్తనియా లకు చోటు దక్కింది. 

పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం, మే9, 2026 న  ప్రమాణ స్వీకారం చేశారు. కోల్ కతాలలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో  జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సువేందు అధికారి చేత గవర్నర్ ఆర్.ఎన్. రవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి  అమిత్  షాతో ఇతర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే నేతలు, పశ్చిమ బెంగాల్  బీజేపీ నేతలు హాజరయ్యారు.  పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 207 స్థానాలను కైవసం చేసుకుని, మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికి ఒక కొత్త రాజకీయ అధ్యాయానికి తెర లేపింది.