డిండి ప్యాకేజీ – 4 టెండర్లకు ఆమోదం

డిండి ప్యాకేజీ – 4 టెండర్లకు ఆమోదం
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీవోటీ

హైదరాబాద్, వెలుగు: డిండి ప్రాజెక్టులో 4వ ప్యాకేజీ పనులకు లైన్ క్లియర్ అయింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండిని లింక్ చేసే 4వ ప్యాకేజీ పనులకు సంబంధించిన టెండర్లకు ఆమోదం లభించింది. బుధవారం నిర్వహించిన కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) సమావేశంలో టెండర్​కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఏదుల నుంచి డిండిని లింక్​ చేసే ప్రాజెక్ట్​లో ప్యాకేజీ 4 కింద 16 కిలో మీటర్ల పొడవున టన్నెల్ నిర్మించనున్నారు. ఈ టన్నెల్​కు రూ.290 కోట్ల టెండర్ ఆమోదం కోసం అధికారులు పంపారు. అయితే, ఆ పనులను చేపట్టిన నిర్మాణ సంస్థ.. టన్నెల్ పనులకు మెషినరీ కోసం సంస్థతో చేసుకున్న జాయింట్​ వెంచర్ ఒప్పందంపై గతంలో అభ్యంతరం తెలిపారు. 

తాజాగా ఆ అభ్యంతరాలన్నింటినీ సీవోటీ క్లియర్​ చేసింది. దీంతో రూ.290 కోట్లతో ప్యాకేజ్ 4 పనుల టెండర్​కు లైన్ క్లియర్ అయినట్టయింది. కాగా, ఏదుల నుంచి డిండి వరకు లింక్ చేయనున్న ఈ ప్రాజెక్ట్​లో మొత్తం 27.9 కిలో మీటర్ల మేర కాల్వలు, సొరంగం పనులు చేపట్టనున్నారు. పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యామ్​ను నిర్మించి.. అక్కడకు ఏదుల నుంచి నీటిని తీసుకెళ్లనున్నారు. పోతిరెడ్డిపల్లి నుంచి 800 మీటర్ల అప్రోచ్ చానెల్, 2.5 కిలో మీటర్ల మేర కాల్వ, 16 కిలో మీటర్ల టన్నెల్, 3 కిలో మీటర్ల మేర కాల్వను నిర్మించనున్నారు. అక్కడి నుంచి 6.3 కిలో మీటర్ల దూరంలోని వాగుకు లింక్ కలపనున్నారు. మొత్తం డిండి ప్రాజెక్ట్​కు రూ.1,800 కోట్లకు జనవరిలో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.