బీజేపీని చేరువ చేయాలని మోర్చాలకు దిశానిర్దేశం

బీజేపీని చేరువ చేయాలని మోర్చాలకు దిశానిర్దేశం
  • ఐదు రాష్ట్రాల మోర్చా లీడర్లతో పార్టీ అగ్రనేతల భేటీలు
  •  మోడీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని అన్ని వర్గాలకు బీజేపీని చేరువ చేయాలని మోర్చాలకు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. ప్రధాని మోడీ తొమ్మిదేండ్ల పాలన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణ, చత్తీస్​గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. ప్రధానంగా బీసీ, ఎస్సీ, కిసాన్, ఇతర మోర్చాల నేతలతో పార్టీ చీఫ్ నడ్డా, అగ్రనేతలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ హెడ్ ఆఫీస్ లో సుదీర్ఘంగా చర్చించారు. ఈ మీటింగ్స్ లో రాష్ట్రం నుంచి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎస్సీ మోర్చా నేషనల్ సెక్రటరీ ఎస్.కుమార్, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు బాషా పాల్గొన్నారు. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జిల్లా స్థాయి, ఇతర స్టేట్లలో రాష్ట్ర స్థాయి సమ్మేళనాలు నిర్వహించాలని సమావేశాల్లో ఆదేశించారు. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కోసం కేంద్రం తెచ్చిన సంక్షేమ పథకాల ఫలాలను ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.

రాష్ట్రంలో ఎస్సీ సీట్లన్ని గెలవాలె

తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లలోని19 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో బీజేపీ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. ఆయా స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్ల శాతం, ప్రస్తుత పరిస్థితులు, ఇతర అంశాలపై రాష్ట్ర నేతలు రిపోర్ట్ అందించారు. దాని ఆధారంగా పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని సూచించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ స్కీంల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారుల లిస్ట్ తయారు చేసినట్లు తెలిసింది. ఆయా లబ్ధిదారులను పార్టీ వైపు మళ్లించడంతో పాటూ, ఇతరులను కూడా ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీంట్లో భాగంగా ప్రతి ఎస్సీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఇక ఓబీసీ వర్గాన్ని కూడా పార్టీకి చేరువయ్యేలా లక్ష్మణ్ నేతృత్వంలో ఓబీసీ మోర్చా సమావేశాలకు సిద్ధమవుతోంది.