
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా జె.ఎస్.ఎస్. వర్ధన్ రూపొందించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతి టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ బ్యానర్స్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మించారు. సెప్టెంబర్ 19న సినిమా విడుదల కానుంది.
ఆదివారం (సెప్టెంబర్ 14న) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘ఇది ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. ఆడపిల్లల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలతో, యథార్థ సంఘటనలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది’ అని చెప్పారు.
అలాగే, ఇటీవలే డైరెక్టర్ మోహన్ శ్రీవాత్సవ చెప్పుతో కొట్టుకోవడంపై మారుతి స్పందిస్తూ..‘‘ఎవరైనా బాధలో ఉంటే మాత్రం అతడిని కలుస్తాను. డైరెక్టర్ మోహన్ చాలా మంచి విజన్ ఉన్న డైరెక్టర్. ‘త్రిబాణదారి బార్బరిక్’ అనే మంచి సినిమా చేశారు. అయితే, ఆ టైటిల్ ఎవరికి అర్ధం కాదని ముందు నుంచే చెబుతూ వస్తున్నా.. అయిన అతను వినలేదు. అయితే, బార్బరీక్ అనే ఒక దేవుడని, ఆయన ఒక ట్రాన్స్‌లో ఉన్నాడు. ఆయన నమ్మాడని నేను కూడా ఫోర్స్ చేయలేను. అయితే ఓ మంచి సినిమా తీసి, ప్రేక్షకులు చూడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. అది నాకు చాలా బాధ అనిపించింది.
డైరెక్టర్ అనేవాడు 10 మంది కళాకారులను తయారు చేసే వాళ్ళు. అలాంటి పిచ్చి పనులు ఎవ్వరు చేయకండి. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రేక్షకులని థియేటర్లలోకి రప్పించడానికి పిచ్చోళ్లలా మాట్లాడుతున్నారు. సినిమాలు మానేస్తా అంటున్నారు... బూతులు మాట్లాడుతున్నారు.. ఒక సినిమా ఆడకపోతే ఇంత దిగజారిపోతారా? ఈ సినిమా ఆడకపోతే ఇంకో సినిమా ఆడుతుంది.
నేను రాసినన్ని డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ ఎవడు రాయలేడు. కానీ ఎందుకు రాయట్లేదు? ఫ్యామిలీస్ రావాలి. మనం మంచి సినిమా ఇవ్వాలి. బూతు డైరెక్టర్ అనేవాడు రూ.400 కోట్లతో ప్రభాస్ని హీరోగా పెట్టి ‘ది రాజాసాబ్’ తీస్తున్నాడు. వాడి ఎదుగుదల చూడండి. వాడి కెరీర్ చూడండి.. ఊరికనే డైరెక్టర్లు అయిపోరని” దర్శకుడు మారుతి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే, దర్శకుడు మారుతి సమర్పణలో బార్బరీక్ విడుదలయింది.
అసలేం జరిగిందంటే:
డైరెక్టర్ మోహన్ శ్రీవత్స..తాను తెరకెక్కించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైంది. అయితే, సినిమాకు థియేటర్స్లో ఆడియన్స్ ఎవ్వరు రాకపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. సినిమా టాక్ బాగున్నప్పటికీ.. తాను వెళ్లిన థియేటర్లో కేవలం 10 మంది మాత్రమే ప్రేక్షకులు ఉన్నారు.
ఈ క్రమంలో ఇంకేం చేస్తే, జనాలు సినిమాకు వస్తారు భయ్యా? రెండున్నరేళ్ల కష్టపడి తీసిన సినిమా ఇది. ఓ మలయాళ సినిమాకు ఇచ్చే ఆదరణ మన తెలుగు సినిమాకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసి బోరున ఏడ్చారు. ఇలా అయితే నేను సినిమాని మలయాళంలో తీసి తెలుగు డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలంటూ డైరెక్టర్ మోహన్ ఆవేదన చెంది చెప్పుతో కొట్టుకున్నారు. ఈ వీడియో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.