PVCU3: తొలి మ‌హిళా సూప‌ర్ హీరో కథతో ప్రశాంత్ వర్మ.. ‘మ‌హా కాళీ’ పాత్రలో బిగ్ బాస్ బ్యూటీ

PVCU3: తొలి మ‌హిళా సూప‌ర్ హీరో కథతో ప్రశాంత్ వర్మ.. ‘మ‌హా కాళీ’ పాత్రలో బిగ్ బాస్ బ్యూటీ

‘ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)’ నుంచి మూడో సినిమాగా ‘మ‌హా కాళీ’ (MAHAKALI) తెరకెక్కుతుంది. భార‌తీయ సినీ ప్ర‌పంచంలో మొద‌టి మ‌హిళా సూప‌ర్ హీరో సినిమాగా రూపొందిస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇందులో భాగంగానే ఈ మైథలాజికల్ థ్రిల్లర్ను మ‌హిళా ద‌ర్శ‌కురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుండటం మరింత విశిష్ఠత సంతరించుకుంది.

ఇప్పటికే, మ‌హా కాళీ టైటిల్ రివీల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఒక అమ్మాయి తన తలను పులికి సున్నితంగా తాకినట్లు చూపించడం, అలాగే ఒక ఫెర్రిస్ వీల్ మంటల్లో కాలిపోవడం, బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్ మధ్యలో డైమండ్ లాంటి ఆకారాన్ని చూపించడం సినిమాపై ఆసక్తి పెంచాయి. 

ఈ క్రమంలోనే ఇవాళ (అక్టోబర్ 30న) ‘మ‌హా కాళీ’ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో కన్నడ నటి, బిగ్ బాస్ బ్యూటీ భూమిశెట్టిని ‘మహాగా’ పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘‘సృష్టి యొక్క విశ్వ గర్భం నుండి విశ్వంలోని అత్యంత క్రూరమైన సూపర్ హీరో మేల్కొంటాడు’’ అని ప్రశాంత్ వర్మ క్యాప్షన్ ఇచ్చారు.
  
ఈ మైథికల్ థ్రిల్లర్లో బాలీవుడ్ నటుడు, ఛావా విలన్ అక్షయ్ ఖన్నా ‘అసురగురు శుక్రాచార్య’ పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ IMAX 3Dలో భారతీయ, విదేశీ భాషలలో విడుద‌ల చేయ‌నున్నట్లు ప్రకటించారు. మ‌హా కాళీ సినిమాను RKD స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు.

భూమిక శెట్టి గురించి:

భూమిక శెట్టి అలియాస్ భూమి శెట్టి కర్నాటకలోని కుందాపురలో 1998లో జన్మించింది. ఆమె కన్నడ, తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు. భూమి మొదట కన్నడలో కిన్నరి సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో నిన్నేపెళ్లాడతా, అత్తారింట్లో అక్క చెల్లెలు సీరియల్స్లో నటించింది.

ఈ క్రమంలోనే రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ సీజన్ 7లో కంటెస్టెంట్గా ఫైనల్కి చేరి, 4వ రన్నరప్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత భూమి శెట్టి 2021 కన్నడ మూవీ ఇక్కత్‌తో సినీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే తెలుగులో షరతులు వర్తిస్తాయి మూవీలో హీరోయిన్గా, కింగ్‌డమ్లో సత్య దేవ్కి భార్యగా నటించి మెప్పించింది. 

ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్:

హనుమాన్ సినిమాతో నేషనల్ వైడ్ ఫేమ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma). సూపర్ హీరో కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.40 కోట్లతో తెరకెక్కిన హనుమాన్, ఏకంగా రూ. 290 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో ప్రశాంత్ తన పేరుతో ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) క్రియేట్ చేసి అందులోనే వరుస సినిమాలు చేసేందుకు సిద్దమయ్యారు. 

అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన హనుమాన్ సినిమాకు సీక్వెల్గా జై హనుమాన్ తెరకెక్కుస్తున్నారు. ఈసారి మరింత భారీ బడ్జెట్తో, అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను మరింత థ్రిల్ చేయడానికి సిద్దమవుతున్నాడు. అలాగే ఈ సినిమాతో పాటు నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్షజ్ఞ‌తో కూడా ఒక సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్పుడు మూడో సినిమాగా మహాకాళి వస్తుంది.