కేసీఆర్​ చెప్పినా వెనక్కి తగ్గని టీఆర్​ఎస్​ రెబల్స్​

కేసీఆర్​ చెప్పినా వెనక్కి తగ్గని టీఆర్​ఎస్​ రెబల్స్​
  • ఎక్కడికక్కడ నామినేషన్లు
  • కాంగ్రెస్ లోకి మంత్రి మల్లారెడ్డి అనుచరుడు
  • ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బాటపట్టిన జూపల్లి టీం​
  • పెద్దపల్లి, మెదక్, ఖమ్మం.. చాలాచోట్ల ఇదే పరిస్థితి
  • కొందరు ఇండిపెండెంట్లుగా పోటీ

హైదరాబాద్, వెలుగు:

మాట వినకుంటే వేటు తప్పదని సీఎం కేసీఆర్​ హెచ్చరించినా.. టీఆర్​ఎస్​ పార్టీ రెబల్స్​ వెనక్కి తగ్గలేదు. మున్సిపల్​ ఎన్నికల నామినేషన్లకు ఆఖరిరోజైన శుక్రవారం అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలు రగిలాయి. స్వయంగా మంత్రుల అనుచరులు, విధేయులుగా ముద్రపడ్డ నేతలు సైతం పార్టీ కండువాలు మార్చేశారు.  దీంతో గులాబీ శిబిరం కలవరపడింది.

మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి.. అసంతృప్తి నేతల ఇండ్లకు ఉరుకులు పరుగులు పెట్టారు. ఇతర పార్టీలో చేరొద్దని, పోటీ చేయొద్దని బతిమిలాడారు. ఢిల్లీలో ఉన్న టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ నేరుగా అసంతృప్తులకు ఫోన్లు చేసి బుజ్జగించారు. అయినా పోటీ నుంచి తప్పుకునేది లేదని ఆ నేతలు స్పష్టం చేశారు. నామినేషన్లు కూడా వేసేశారు. టీఆర్​ఎస్​ అభ్యర్థులను ఓడిస్తామని అంటున్నారు.

షాకిచ్చిన మంత్రి మల్లారెడ్డి అనుచరుడు

మంత్రి మల్లారెడ్డి అనుచరుడు సీఎం కేసీఆర్ కు షాకిచ్చారు. టికెట్ ఇవ్వలేమని, నామినేటెడ్ పదవి ఇస్తామని కేసీఆర్ స్వయంగా నచ్చజెప్పినా ఆయన వెనక్కితగ్గలేదు. కేసీఆర్​ ముందు సరే అన్న ఆ నేత.. తెల్లారేసరికి పార్టీ మారి కాంగ్రెస్ నుంచి మున్సిపోల్స్​లో పోటీకి సిద్ధమయ్యారు. హైదరాబాద్ శివారులోని ఫిర్జాదిగూడ టీఆర్ఎస్ నాయకుడు దర్గా దయాకర్ రెడ్డి మంత్రి మల్లారెడ్డికి ప్రధాన అనుచరుడు. మేయర్ పదవి ఆశించి కార్పొరేటర్​గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అదిగో, ఇదిగో అంటూ గురువారం రాత్రి వరకు ఆయనను ప్రగతిభవన్ చుట్టూ తిప్పుకున్నారు. చివరి నిమిషంలో సీఎం కేసీఆర్.. టికెట్ ఇవ్వలేమని, నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. టికెట్ రాలేదన్న ఆవేదనలో ఉన్న  దయాకర్ రెడ్డి ఇంటికి శుక్రవారం ఉదయాన్నే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడే  ఆయనకు కాంగ్రెస్ కండవా కప్పి, పార్టీలో చేర్చుకున్నారు. వెంటనే ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా దయాకర్ రెడ్డి పేరును  ప్రకటించారు. దయాకర్​ నామినేషన్​ వేశారు. విషయం తెలిసి మంత్రి మల్లారెడ్డి దయాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో మల్లారెడ్డి కారులో దయాకర్​ను ఎక్కించుకునే అజ్ఞాతంలోకి తీసుకెళ్లి.. సీఎం కేసీఆర్, కేటీఆర్‌‌తో ఫోన్‌‌లో మాడ్లాడించి బుజ్జగిస్తున్నట్లు తెలిసింది.

ఇంకా ఎన్నో చోట్ల..

పెద్దపల్లి మున్సిపల్  మాజీ చైర్​పర్సన్​ ఎలువాక రాజయ్యకు ఈసారి ఎన్నికల్లో చుక్కెదురైంది. ఈ మున్సిపాలిటీ చైర్​పర్సన్​ పదవి​ జనరల్​ మహిళకు కేటాయించడంతో రాజయ్య తన భార్యను బరిలోకి దింపాలని భావించారు. అయితే టీఆర్​ఎస్​ నుంచి టికెట్​రాకపోవడంతో రాజయ్య.. ఆల్​ ఇండియా ఫార్వడ్​ బ్లాక్​ పార్టీ టికెట్​పై పలువురిని పెద్దపల్లి మున్సిపల్​ బరిలో నిలిపారు. తనతో పాటు తన భార్య పోటీకి దూరంగా ఉన్నప్పటికీ టీఆర్​ఎస్​కు వ్యతిరేకంగా అభ్యర్థులను పోటీకి దింపారు.

మెదక్ మున్సిపాలిటీలో ఆరుగురు సిట్టింగ్ కౌన్సిలర్లకు టీఆర్ఎస్  పార్టీ టికెట్లు నిరాకరించింది. దీంతో  వారిలో ఒకరు బీజేపీ అభ్యర్థిగా, ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులుగా, మరో ముగ్గురు ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేశారు.

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో పలు మున్సిపాలిటీల్లోనూ అసమ్మతి సెగలు రేగాయి. అలంపూర్ లో  ఎమ్మెల్యే ప్రకటించిన అభ్యర్థులను కాదని మాజీ ఎంపీపీ ఇస్మాయిల్‌‌‌‌ వర్గం అన్ని వార్డుల్లోనూ బరిలో నిలిచింది. అయిజ మున్సిపాలిటీలో ఎంపీపీ తిరుమలరెడ్డి వర్గానికి చెందిన 20 మంది నామినేషన్లు వేశారు. గద్వాలలో ఏడెనిమిది వార్డుల్లో అసమ్మతి ఎగిసిపడింది. కొందరు టీఆర్ఎస్ లీడర్లు ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచారు. టికెట్ఆశించి బీజేపీ నుంచి టీఆర్ఎస్​లోకి  వెళ్లిన ఇద్దరు నేతలు ఆఖరికి ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు. ఇక్కడి గంజి పేట, చింతలపేట, న్యూ హౌసింగ్ బోర్డ్, కృష్ణారెడ్డి బంగ్లా తదితర కాలనీలకు చెందిన వారు రెబల్‌‌‌‌గా  నిలిచారు.

ఖమ్మం జిల్లాలోని వైరాలో  20 వార్డులు ఉండగా, 16 మందికి ఎమ్మెల్యే రాములు నాయక్ శుక్రవారం​ బీఫాంలను అందజేశారు. కానీ టీఆర్​ఎస్​లో చాలా మంది వెనక్కి తగ్గకుండా నామినేషన్లు వేశారు. జాబితాలో తన పేరు లేకపోవడంతో ఓ టీఆర్ఎస్​ కార్యకర్త తన వార్డుకు చెందిన నేతలతో కలిసి ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ను ముట్టడించారు. బీఫామ్​ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.

జూపల్లి టీం.. ఫార్వర్డ్ మార్చ్​

కొల్లాపూర్‌‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు నలుగురు టీఆర్ఎస్‌‌కు గుడ్ బై చెప్పారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి ఆ పార్టీ బీ ఫారాలతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కొల్లాపూర్ మున్సిపల్ టికెట్లలో కొన్ని తనకు ఇవ్వాలని జూపల్లి మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంతో జూపల్లి అనుచరులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలని టార్గెట్​ పెట్టుకున్నారు.

బీజేపీలోకి మాజీ చైర్​పర్సన్​

జనగామ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి బీజేపీలో  చేరారు. ప్రేమలతారెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు  అనుచరుల్లో ఒకరు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి, ఆమె వర్గానికి పడటంలేదని తెలుస్తోంది. జిల్లా పరిషత్ ఎన్నికల సమయం నుంచి ఆమె టీఆర్ఎస్​కు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ వస్తుందని ఆశించారు. కానీ చివరి నిమిషంలో బీ ఫారం రాదని తేలడంతో బీజేపీలో చేరి 18వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు.

Disappointed TRS leaders have joined other parties in many places across the state