పంచాయతీ రాజ్​లో డిసిప్లినరీ యాక్షన్​​

పంచాయతీ రాజ్​లో డిసిప్లినరీ యాక్షన్​​

పంచాయతీ రాజ్​లో డిసిప్లినరీ యాక్షన్​​
పెండింగ్​ కేసులు తీస్తున్నరు
జడ్పీ, మండల పరిషత్ లో 200వరకు ఉంటాయని అంచనా
పదేళ్ల రికార్డులు తిరగతోడుతున్న అధికారులు
రి టైర్ అయిన వారిపైనా చర్యలు

హైదరాబాద్, వెలుగు: జిల్లా, మండల పరిషత్ లో పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న డిసిప్లినరీ కేసులు పంచాయతీ రాజ్ అధికారులు తిరగతోడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సర్వీసులో ఉన్న అధికారులపై డిమోషన్, ఇంక్రిమెంట్ కట్ లాంటి చర్యలు తీసుకోనుండగా, రిటైర్ అయిన అధికారులు ఉంటే పెన్షన్ కట్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి పీఆర్ అధికారులు లేఖ రాయనున్నారు. 10 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న డిసిప్లినరీ కేసులు మొత్తం 200 వరకు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. ఈ కేసులను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ కమిషనర్ కు నివేదిక అందచేయనున్నారు. గతంలో రూల్స్ ఉల్లంఘించి చార్జ్ మెమో అందుకున్నవాళ్లు, ఏసీబీ కేసులలో దొరికి విచారణ పూర్తి కాకపోవటం, సస్పెన్షన్ అయి ఆరోపణలపై విచారణ జరగకపోవటం, ఇతర అంశాలలో విచారణ పెండింగ్ లో ఉన్నవి డిసిప్లినరీ కేసులలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

గ్రామ కార్యదర్శి నుంచి జడ్పీ సీఈవో వరకు..

డిసిప్లినరీ కేసులలో పంచాయతీ కార్యదర్శి నుంచి ఎంపీడీవో, సూపరింటెండెంట్లు, అకౌంట్ ఆఫీసర్లు , డిప్యూటీ సీఈవో, సీఈవో వరకు ఉన్నట్లు తెలుస్తోంది. గత పదేళ్ల నుంచి అధికారుల కొరత, ఇతర శాఖలకు చెందినవారు జడ్పీ సీఈవోలుగా ఉండటం వల్ల ఈ కేసులు పెండింగ్ లో ఉన్నాయి.  ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖలోని జాయింట్ కమిషనర్ , డీపీవో స్థాయి అధికారి ఈ డిసిప్లినరీ కేసులను తిరగతోడే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలో జడ్పీ సీఈవోలు, సూపరింటెండెంట్లతో సమావేశమై ఈ కేసుల పూర్వాపరాలు, వాటి నివేదిక తీసుకునే పనిలో ఉన్నారు.  పెండింగ్ కేసులను తిరగతోడటంపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ సీనియర్ పంచాయతీ  కార్యదర్శి స్పందించారు.

‘పెండింగ్ డిసిప్లినరీ కేసుల వల్ల కొంతమందికి ప్రమోషన్లు ఆగాయి, ఇంక్రిమెంట్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఇవి నిష్పక్షపాతంగా జరగాలి.  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉన్నతాధికారిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నోసార్లు ఆ అధికారి వ్యవహరించారు. కొంతమంది కార్యదర్శులను నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ ఫర్లు చేస్తున్నారు. ల్యాండ్ వెంచర్లలో తక్కువ ధరకు భూములు కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ’  అని ఆయన తెలిపారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.