రామప్పకు వచ్చే టూరిస్టులకు విమాన టికెట్లపై రాయితీ

రామప్పకు వచ్చే టూరిస్టులకు విమాన టికెట్లపై రాయితీ
  • వరంగల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్​పోర్టును పునరుద్ధరిస్తం: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి


జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి / వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌ (రామప్ప)/ వరంగల్​, వెలుగు: రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. రామప్పకు టూరిస్టుల రాకను ప్రోత్సహించేందుకు విమాన టికెట్లపై సెంట్రల్‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ రాయితీ కల్పిస్తుందని చెప్పారు. వరంగల్‌‌‌‌‌‌‌‌  ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టును ఉడాన్‌‌‌‌‌‌‌‌ స్కీంలో చేర్చి పునరద్ధరించడానికి ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనికి అవసరమైన భూసేకరణ పూర్తిచేసి, మౌలిక వసతులు కల్పిస్తే చాలన్నారు. గురువారం రామప్ప ఆలయాన్ని ఆయన సందర్శించారు. రామప్ప ఆలయానికి యునెస్కో నుంచి అందిన ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప అని అన్నారు. ఈ గుర్తింపు రావడంలో ప్రధాని మోడీ, సెంట్రల్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్లు చాలా శ్రమించారని చెప్పారు.  ముఖ్యంగా యునెస్కోలో భారత ప్రతినిధిగా ఉన్న విశాల శర్మ, కాకతీయ హెరిటేజ్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధులు పాండు రంగారావు, రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ పాపారావు కృషి అమోఘమని ఆయన కొనియాడారు.  
రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి
గట్టమ్మ దేవాలయం, బొగత జలపాతం, మల్లూరు, తాడ్వాయి, దామెరవాయిలలో కేంద్ర ప్రభుత్వ  నిధులతో క్యాంటిన్లు, హోటళ్లు నిర్మించామని, మౌలిక వసతులు కల్పించామని కిషన్​రెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో వరంగల్‌‌‌‌‌‌‌‌ వెయ్యిస్తంభాల గుడి, వరంగల్‌‌‌‌‌‌‌‌ కోట‍ అభివృద్ధికి,  జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ టెంపుల్‌‌‌‌‌‌‌‌, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని సింగోటం, మల్లెల తీర్థం, శ్రీశైలం, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని గోల్కొండ పోర్ట్‌‌‌‌‌‌‌‌, చార్మినార్‌‌‌‌‌‌‌‌ తదితర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  తక్కువ కాలంలోనే 100 కోట్లకు పైగా డోసులు వేసి కరోనా నుంచి ఇండియా స్వీయ రక్షణ పొందడంపై ప్రపంచ దేశాలు గర్విస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి చెప్పారు.  త్వరలోనే 12 నుంచి 18 మధ్య వయసుల వారికి వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కాగా, ములుగులో హరిత కాకతీయ హోటల్‌‌‌‌‌‌‌‌ను కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి  ప్రారంభించారు. 
రెండో రాజధానిగా వరంగల్​
వరంగల్​ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు వంద శాతం కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‍రెడ్డి అన్నారు. గురువారం ఆయన వెయ్యిస్తంభాల గుడి, ఖిలా వరంగల్‍ కోటను  సందర్శించారు. వెయ్యిస్తంభాల గుడి పనులు 4 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

కాకతీయ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తాం: శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌
వరంగల్‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లాలో ఉన్న కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని గుర్తించేలా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకతీయ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ అన్నారు.  త్వరలోనే బుద్ధవనం ఏర్పాటు చేస్తామన్నారు. 


మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాలి: సీతక్క
 ములుగు జిల్లాలో పర్యాటక ప్రాంతాలను సత్వరమే అభివృద్ధి చేయాలని, మేడారం జాతరకొచ్చే భక్తులకు వసతి సౌకర్యం కల్పించాలని, అన్ని ప్రాంతాల నుంచి ములుగుకు బస్ సౌకర్యం కల్పించేలా ఆర్టీసీ బస్‌‌‌‌‌‌‌‌ డిపోను ఏర్పాటు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాలన్నారు. రామప్ప లో ఆర్కిటెక్చర్ కాలేజీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి  వినతి ప్రతం అందించారు.