పార్టీ ఫిరాయింపులపై చర్చ.. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదం.. సభలో గందరగోళం

పార్టీ ఫిరాయింపులపై చర్చ.. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదం.. సభలో గందరగోళం
  • పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీలో డిస్కషన్
  • సబిత తనను మోసం చేశారన్న సీఎం రేవంత్
  • మంత్రి  పదవికోసం పార్టీ మారారన్న ముఖ్యమంత్రి   
  • తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్న సబిత
  • సబితకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్  పట్టు
  • చప్పట్లు కొడుతూ వెల్ లోకి గులాబీ ఎమ్మెల్యేలు
  • రూల్స్ బ్రేక్ చేశారని మంత్రి సీతక్క అభ్యంతరం
  • ఆందోళన మధ్య శాసన సభ రేపటికి వాయిదా
  • అసెంబ్లీ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన

హైదరాబాద్: అసెంబ్లీలో చర్చ కాస్తా రచ్చగా మారింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్ లోకి దూసుకువెళ్లడంతో గందరగోళం  నెలకొంది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను రేపటికి వాయిదా వేశారు.  పార్టీ ఫిరాయింపులపై చర్చ సందర్బంగా సబితా ఇంద్రారెడ్డి తనను మోసం చేశారని, పార్టీలో చేరాలని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి ఆమె బీఆర్ఎస్ లో చేరి మంత్రిపదవి పొందారని అన్నారు. సబితను అక్కగా భావించే తాను కాంగ్రెస్ లో చేరినట్టు చెప్పారు. తనను మోసం చేశారు కాబట్టే.. సబితను నమ్మొద్దని కేటీఆర్‌కు చెబుతున్నానని సీఎం అన్నారు. 

సీఎం చేసిన కామెంట్లు సభలో దుమారం రేపాయి. సీఎం వ్యాఖ్యలపై సబిత మాట్లాడుతూ.. సీఎం ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చారనేది తెలుసుకోవాలన్నారు.  కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి, తన ఇంటి మీద వాలితే కాల్చి చంపేస్తామని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సబిత ప్రశ్నించారు. దీంతో సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

అంతకు ముందు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తమ శాసన సభా పక్షాన్నే బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారని గుర్తు చేశారు. ఒక దళితుడు ఎల్పీ నేతగా ఉండడాన్నీ జీర్ణించుకోలేక పోయారని అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. భోజన విరామం కోసం సభను వాయిదా వేశారు. అనంతరం మళ్లీ సభ ప్రారంభం కాగానే సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. 

వెల్ లోకి దూసుకెళ్లి సభను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతుండగా అడ్డుతగిలారు. చప్పట్లు కొడుతూ నిరసన తెలిపారు. ఇదే తరుణంలో డిప్యూటీ సీఎం ద్రవ్య వినిమయ బిల్లును ప్రతిపాదించగా.. స్పీకర్ సభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. 

ఆడబిడ్డల ఉసురు తగుల్తది: కేటీఆర్

అసెంబ్లీ వాయిదా తర్వాత బయటికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ సమీపంలో ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మహిళలని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అంటూ రేవంత్ మహిళలని అవమానించారని ఆరోపించారు. మహిళల్ని అవమానించిన రేవంత్ రెడ్డికి  సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తామ హయాంలో ఏ ఒక్కరినీ అవమానించలేదని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సీఎంకు తగదని, సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.